‘ఆదిత్య 369’ అనేది ఓ మైల్ స్టోన్ మూవీ. సింగీతం శ్రీనివాసరావు చేసిన అద్భుతాల్లో అదొకటి. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని అటు బాలకృష్ణ, ఇటు సింగీతం ఇద్దరూ చాలా సార్లు అనుకొన్నారు. బాలయ్య వందో సినిమా సందర్భంగా ‘ఆదిత్య 999’ని పట్టాలెక్కిద్దాం అనుకొన్నారు. ఆ సమయంలోనే సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్టు కూడా పూర్తి చేసి బాలకృష్ణ చేతిలో పెట్టారు. కానీ అది ఎందుకో వర్కవుట్ కాలేదు. ఆ తరవాత వందో సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కించడం, ఆ తరవాత వరుస సినిమాలతో దూసుకుపోవడంతో.. ఆదిత్య 999 పక్కన పెట్టారు.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా క్రిష్ చేతిల్లోకి వెళ్లింది. ఆయన ‘ఆదిత్య 999’ కోసం ఓ కొత్త కథ రాసుకొంటున్నారు. మరి అప్పట్లో సింగీతం సిద్ధం చేసిన స్క్రిప్టు ఏమైనట్టు? అప్పట్లో బాలయ్యకు బాగా నచ్చిన కథ కదా. దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? అనే విషయాలు ఆరా తీస్తే.. ‘ఆదిత్య 999’లోకి కొంత పార్ట్ సింగీతం ఆల్రెడీ వాడేశారని టాక్.
‘కల్కి’ సినిమాకు సింగీతం స్క్రిప్టు కో ఆర్డినేటర్ గా పని చేశారు. ‘కల్కి’ కథలో, స్క్రిప్టులో ఆయన వాటా కొంత ఉంది. ఆ సినిమాలో కొంత పోర్షన్ ను ‘ఆదిత్య 999’ స్క్రిప్టు నుంచి తీసుకొన్నారని టాక్. అంతేకాదు.. ‘కల్కి 2’లో కూడా దాన్ని వాడబోతున్నార్ట. అంటే.. సింగీతం రాసిన ఆదిత్య 999 స్క్రిప్టు కల్కి రూపంలో వచ్చేసినట్టే. అందుకే సింగీతం స్క్రిప్టు ఇప్పుడు ఆదిత్య 999కి వాడడం లేదు. ఆ స్థానంలో క్రిష్ కొత్త కథ రాసుకొంటున్నార్ట. లేదంటే.. సింగీతం కథతోనే ‘ఆదిత్య 999’ పట్టాలెక్కేది. ఘాటీ తరవాత క్రిష్ బాలయ్యతోనే సినిమా చేస్తారని, అది ఆదిత్య 999 అని, ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాలీవుడ్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్రిష్ మాత్రం మాట్లాడడం లేదు. ఏ ప్రకటన వచ్చినా అది బాలయ్య నుంచే రావాలని చెబుతున్నారు. మరి బాలయ్య ఎప్పుడు స్పందిస్తారో?