ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పోలవరం ప్రాజెక్టు ద్వారా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీళ్ళు విడుదల చేయబోతున్నారు. నాలుగయిదు రోజుల క్రితమే ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. తాటిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు నుండి పోలవరం కుడి కాలువ ద్వారా వెలగలేరు గ్రామం వద్ద ఉన్న భలేరావు ట్యాంక్ కి నీళ్ళు పంపించి అక్కడి నుండి బుడమేరు కాలువ ద్వారా కృష్ణా నదిలోకి గోదావరి నీళ్ళను మళ్ళిస్తారు. దానితో కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన కార్యక్రమం పూర్తవుతుంది. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్ళు విడుదల చేసిన తరువాత కృష్ణా, గోదావరి నదులు అనుసందానమయ్యే ఇబ్రహీం పట్టణం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఏటా సుమారు 3,000 టి.యం.సి.ల గోదావరి నీళ్ళు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటిలో ఈ ఏడాది కనీసం 80-90 టి.యం.సి.ల నీటినయినా కృష్ణా నదికి మళ్ళించి అక్కడి నుండి ఆ మిగులు జలాలను రాయలసీమకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక పంపును ప్రారంభించి ఈ ఎత్తిపోతల పధకాన్ని ఆరంభిస్తారు. ఈ నెలాఖరుకి మరో మూడు పంపులు పనిచేయడం ఆరంభిస్తాయి. దీని ద్వారా ఈ ప్రాజెక్టులో మొత్తం 24 పంపులు అమర్చుతున్నారు. అన్ని పంపులు పనిచేయడం మొదలుపెడితే సముద్రంలో వృధా పోతున్న గోదావరి నీటిలో కనీసం పావుశాతం అయినా నీటిని పంట భూములకు మళ్ళించుకొనే అవకాశం ఉంది.