కృష్ణంరాజుకెప్పుడూ సినిమా కష్టాలు ఎదురు కాలేదు. దానికి కారణం.. వాళ్లది ఉన్నత కుటుంబం కావడమే. డబ్బుకి లోటు లేదు. అందుకే ముందు నుంచీ… జల్సాగా గడిపేసేవారు కృష్ణంరాజు. కాలేజీ రోజుల్లోనే ఖరీదైన కార్లు, టూ వీలర్లలో తిరిగేవారు. ఆ రోజుల్లో కాలేజీకి కారులో వెళ్తుంటే.. ‘కొత్తగా చేరిన లెక్చరర్ ఏమో..’ అని భ్రమపడేవాళ్లంతా. దానికి తోడు కాలేజీకి వెళ్లింది చాలా తక్కువ. కృష్ణంరాజు జల్సాలు చూసి ఓర్వలేని ఓ మిత్రుడు… కృష్ణంరాజు తండ్రి ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణకు ఆకాశరామన్న పేరుతో ఓ ఉత్తరం రాశాడు. తండ్రి కష్టపడి డబ్బులు పంపుతుంటే, కొడుకు దర్జాగా జల్సాలు చేస్తున్నాడని, డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాడని, అర్జెంటుగాఇ కృష్ణంరాజుని దారిలో తెచ్చుకోకపోతే.. చేయి దాటిపోతాడన్నది ఆ ఉత్తరంలో సారాంశం.
కొడుకు మీద ఫిర్యాదు చేస్తూ ఇలాంటి ఉత్తరాలు వస్తే ఏ తండ్రయినా. ఆవేశంతో రెచ్చిపోయి, కొడుకుకు క్లాస్ పీకడం ఖాయం. కానీ… వీర వెంకట సత్యనారాయణ అదేం చేయలేదు. వెంటనే కృష్ణంరాజుకి ఓ ఉత్తరం రాశారు. దానికి.. ఆకాశరామన్న ఉత్తరాన్నీ జోడించారు. “నీ గురించి ఎవరో ఉత్తరం రాశారు. నువ్వులు తప్పు చేస్తున్నావని అన్నారు. కానీ నేనేం నమ్మడం లేదు. నీపై నాకు భరోసా ఉంది. నువ్వు ఎప్పటికీ తప్పు చేయవు. ఓ తండ్రిగా నీకు ఏం కావాలో అవన్నీ సమకూర్చే బాధ్యత నాపై ఉంది. నీ జీవితంలో ఏ విషయం గురించీ నేను జోక్యం చేసుకోను. కానీ నీపై ఈర్ష్య పడే ఇలాంటి స్నేహితులకు దూరంగా ఉండు“ అని ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ ఉత్తరం చదివిన కృష్ణంరాజు కన్నీటి పర్యంతమయ్యార్ట. అప్పటి నుంచీ ఎలాంటి తప్పు చేయకుండా. తన తండ్రికి తలవొంపులు తీసుకురాకుండా ఉండాలనే నిర్ణయం తీసుకొన్నారు. తన బిడ్డల విషయంలోనూ తాను ఇలానే ప్రవర్తించేవాడినని, వాళ్లకు కావల్సినంత స్వేచ్ఛని ఇచ్చానని చెప్పేవారు కృష్ణంరాజు.