సీనియర్ హీరోలలో రెబల్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకున్న హీరో కృష్ణం రాజు. రెబలిజం అంటే ఎలా ఉండాలో తన సినిమాల ద్వారా చెప్పిన కృష్ణం రాజు అభిమానుల హృదయాల్లో రెబల్ స్టార్ గా నిలిచిపోయారు. అయితే ఇప్పుడు మరో కొత్త బిరుదుతో ఆయన్ను సత్కరిస్తున్నారు సుబ్బిరామిరెడ్డి. ఈ నెల 7న మహాశివరాత్రి సందర్భంగా ‘నటవిరాట్’ బిరుదుతో కృష్ణం రాజుని సత్కరించనున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత, రాజకీయ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సత్కారం జరుగనుంది. తన నటనతో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి నటనకు కొత్త భాష్యం చెప్పిన రెబల్ స్టార్ ఇకనుండి నట విరాట్ గా పిలువబడతారు. కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న కృష్ణం రాజు ఈ మధ్య సినిమాలను తగ్గించి రాజకీయాల్లో ఎక్కువ కాన్సెంట్రెట్ చేస్తున్నారు.
ఇక తను చేసిన సినిమాలకు గాను 4 ఫిల్మ్ ఫేర్ మరియు 3 నంది అవార్డులను దక్కించుకున్న రెబల్ స్టార్ నటవిరాట్ అనే బిరుదు దక్కడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిని పరిశ్రమకు సంబంధించిన మహా మహులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రెబల్ స్టార్ అదే ఈ నట విరాట్ ఆశీస్సులతోనే యంగ్ రెబల్ స్టార్ గా తెలుగు సినిమా చరిత్రలో రికార్డులను తిరగరాసే సినిమాలను తీస్తూ పెదనాన్న తన మీద పెట్టిన భరోసాను నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తూ రెబల్ స్టార్ స్టామినా ఏంటో రుజువు చేస్తున్నాడు ప్రభాస్.