నెల్లూరు సమీపంలోగల కృష్ణపట్నం పోర్టు నుంచి చైనాకి వారానికి ఒకసారి చొప్పున సరుకు రవాణా చేసే షిప్పింగ్ సర్వీస్ ని మొన్న సోమవారం ప్రారంభం అయ్యింది. కృష్ణపట్నం పోర్ట్ సి.ఈ.ఓ. అనిల్ ఎండ్లూరి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్.సుబ్బారావు, మేయిర్సక్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రాంక్ డెడ్నీస్ తదితరులు ఈ సర్వీసుని ప్రారంభించారు. ఈ వీక్లీ సర్వీస్ వలన ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే కాకుండా తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుంచి చైనాకి ఎగుమతులు చేసే అవకాశం, అలాగే చైనా నుంచి దిగుమతులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీక్లీ సర్వీసుతో చైనాలోని షాంఘై, క్వింగ్డో, నన్షా, జిగంగాంగ్, బుసాన్ పోర్టులతో బాటు సింగపూరు పోర్టుకి సరుకు రవాణా వీలుపడుతుంది.
ఇంతవరకు విశాఖ పోర్టు నుంచి ముడి ఖనిజాలు, గ్రేనైట్, సముద్ర ఉత్పత్తులు మొదలైనవి చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాలకి రవాణా అవుతున్నాయి. అదేవిధంగా విదేశాల నుంచి బొగ్గు, ఇతర ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా షిప్పింగ్ సర్వీసులు మొదలవడంతో ఎగుమతి, దిగుమతులు ఇంకా జోరందుకొంటాయి. ఆంధ్రప్రదేశ్, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కాటన్, ముడి ఖనిజాలు, బియ్యం, గోధుమలు, మిరపకాయలు మొదలైనవి విదేశాలకి ఎగుమతి చేసే అవకాశం కలిగింది. గత రెండు దశాబ్దాలుగా చైనా గుండు సూదులు మొదలుకొని ఫ్యాన్లు, బట్టలు, బైక్స్, గృహోపకరణాలతో భారత్ మార్కెట్లని ముంచెత్తుతోంది. ఇప్పుడు ఈ డైరెక్ట్ సర్వీసులు మొదలయ్యాయి కనుక ఇంకా బారీ ఎత్తున చైనా వస్తువులు భారత మార్కెట్లని ముంచెత్తవచ్చు. అయితే కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఎగుమతులకి అవకాశం పెరగడంతో ఏపి, దాని ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు జోరందుకోవచ్చు.