అన్నా, చెల్లెళ్ల మధ్య విబేధాలు నిజమేనా? ఇద్దరి మధ్య ఏ పొరపొచ్చాలు లేకపోతే…. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ తన చెల్లి పేరును ఎందుకు ప్రస్తావించలేదు?…కేసీఆర్ దేవుడు , ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసినా వాటిపై స్పందించేందుకు కేటీఆర్ ఎందుకు నిరాకరించారు? కవిత రాసిన లేఖ కేటీఆరే లీక్ చేయించారా?
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉండటంతో రాజీనామా చేయాలని డిమాండ్ తో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారని చెబుతున్నా, కవితకు కౌంటర్ ఇచ్చేందుకే మీడియా సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జీ షీట్ లో రేవంత్ పేరును ప్రస్తావించడంతో కేటీఆర్ శుక్రవారం ఉదయమే ట్వీట్ చేశారు. తాను చెప్పాలనుకున్నదంతా ఎక్స్ వేదికగా చెప్పేశారు. ఇంచుమించు శనివారం మాట్లాడినదంతా నిన్నే ట్వీట్ రూపంలో తన అభిప్రాయాన్ని చెప్పేశారు. అయినా నేడు అదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టారంటేనే ఎక్కడో తేడా కొట్టేసింది.
అయినా మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్.. కవిత లేఖపై స్పందించినా ఆమె పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా పరోక్షంగా ఆమెకు వార్నింగ్ ఇచ్చ్చారు. అంతర్గత విషయాలు లోపలే మాట్లాడుకోవాలని , బయటకు వచ్చి మాట్లాడవద్దని సున్నితంగా హెచ్చరించారు కేటీఆర్. కవిత చేసిన దేవుడు, దయ్యాలు అనే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అయన వాటి గురించి ఇప్పుడెందుకు అని దాటవేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది కానీ వివరణ ఇచ్చేందుకు నిరాకరించారంటేనే కవిత- కేటీఆర్ మధ్య గ్యాప్ ఉందనేది క్లియర్ గా అర్థం అవుతోంది.
తాను రాసిన లేఖ లీక్ కావడం వెనక కుట్ర జరిగిందని కవిత ఆరోపించారు. ఇది పార్టీలోని కొంతమంది చేసిన కుట్రలేనని చెప్పారు. ఆ అవసరం ఎవరికీ ఉంటుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కవిత అమెరికా వెళ్లాక కేటీఆర్ – హరీష్ రావు భేటీ కావడం, ఆ తర్వాత ఈ లేఖ లీక్ కావడం, కవిత కామెంట్స్ పై కేటీఆర్ నేరుగా సమాధానం ఇవ్వకపోవడం పట్ల కేటీఆరే ఆ లేఖ లీక్ చేసి ఉంటారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. కవిత సన్నిహితులు కూడా కేటీఆర్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.