రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాల కంటే భావోద్వేగాలు ఓటర్లను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక సమర్థుడైన నేత ప్రజల్లో ఎమోషన్ సృష్టించాలే తప్ప, తాను స్వయంగా భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ కాన్సెప్ట్ సీనియర్ నేతలు బాగా వంట బట్టించుకుంటారు. వారు నేర్చుకునే ప్రాథమిక రాజకీయ సూత్రాల్లో ఒకటి అదే. కానీ వారసులు మాత్రం అదంతా పాతకాలం రాజకీయం అనుకుంటున్నారు. కేటీఆర్, జగన్ రాజకీయాలు చేస్తున్న వైనమే దానికి నిదర్శనం.
భావోద్వేగాలతో జగన్, కేటీఆర్ రాజకీయాలు
రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఒక శిల్పి లాంటి వాడు. ప్రజల మనోభావాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలోనే అతని విజయం దాగి ఉంటుంది. కానీ, ఎప్పుడైతే నాయకుడు స్వయంగా భావోద్వేగాలకు గురవుతాడో అక్కడే అతని ఎదుగుదల ఆగిపోతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ తమ రాజకీయ ప్రస్థానంలో ఒకే రకమైన ‘ఎమోషనల్ ట్రాప్‌లో చిక్కుకున్నారని వారు చేస్తున్న రాజకీయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను, జగన్ తన తండ్రి మరణం తర్వాతి ఓదార్పు సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అధికారాన్ని అందుకున్నారు. అది వారి వ్యూహం. కానీ, అధికారం కోల్పోయిన తర్వాత లేదా విమర్శలు ఎదురైనప్పుడు కేటీఆర్, జగన్ ఇద్దరూ పబ్లిక్ ఫోరమ్‌లలో లేదా సోషల్ మీడియాలో చూపిస్తున్న స్పందనలు వారు వ్యక్తిగతంగా భావోద్వేగాలకు గురవుతున్నట్లు సూచిస్తున్నాయి.
సీనియర్ నేతల రాజకీయాలకు అదే పనిగా దెబ్బలు తింటున్న వైనం
కేటీఆర్ ఇప్పటి వరకూ ప్రతిపక్షంలో లేరు. అధికారం, తిరుగులేని సపోర్టు పొందుతూ వచ్చారు. గత రెండేళ్లుగా అనధికారికంగా ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నారు. కానీ ఆయన ఆకట్టుకోలేకపోతున్నారు. కారణం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలకు ఆయన స్పందిస్తున్న తీరులో అసహనం కనిపిస్తోంది. సభలో లేదా ప్రెస్ మీట్లలో ఆయన వాడుతున్న కొన్ని పదజాలాలు చూస్తుంటే.. ప్రత్యర్థి వేసిన వ్యూహంలో చిక్కుకుని ఎమోషనల్ అవుతున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. అసెంబ్లీలో రేవంత్ కు గౌరవం ఇవ్వాలనుకోవకపోవడం కూడా ఇలాంటిదే. ఇది పార్టీ కేడర్‌లో ధైర్యం నింపడం కంటే, నాయకత్వంలో ఆందోళనను బయటపెడుతున్నట్లు ఉంది.
జగన్ రాజకీయం రప్పా..రప్పా.. ఎవరూ చెప్పలేరు..మార్చలేరు !
వైఎస్ జగన్ విషయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా ఆయన తన రాజకీయ భాషలో మార్పు తీసుకురాలేదు. రప్పారప్పా నరికేస్తాం అంటూ బేలగా బెదిరిస్తున్నారు. ఆయనలోని కక్ష సాధింపు ధోరణిని చూపిస్తున్నాయి తప్ప, ప్రజల నాడిని పట్టుకున్నట్లు అనిపించడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేక భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే స్టేట్మెంట్లు తటస్థ ఓటర్లను మరింత దూరం చేసే ప్రమాదం ఉంది. నాయకుడు భావోద్వేగాలకు లోనైనప్పుడు: ప్రత్యర్థి ఎటు నుండి దెబ్బతీస్తున్నాడో గమనించలేరు. అతిగా స్పందించడం వల్ల సెల్ఫ్ గోల్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. నాయకుడే ఉద్వేగానికి లోనైతే, కింద ఉన్న కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లుతుంది.
రాజకీయాల్లో ప్రజలను ఉద్వేగానికి గురిచేయడం ఒక కళ. కానీ నాయకుడు ఆ ఉద్వేగానికి అతీతంగా ఉండి చదరంగం ఆడాలి. కేటీఆర్, జగన్ ఇద్దరూ యువ నేతలు, అపారమైన సామర్థ్యం ఉన్నవారు. అయితే, వారు తమ వ్యక్తిగత భావోద్వేగాలను పక్కన పెట్టి, ప్రజల అవసరాలను తమ ఎమోషన్స్‌గా మార్చుకోగలిగితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వెనక్కే పోతారు.


