కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి రాకుండా తాము సీపీఐకి మద్దతు ఇస్తామని కేటీఆర్ ప్రకటించేశారు. మీడియా సమావేశంలో ప్రకటించకముందే సీపీఐ నేత కూనంనేనికి ఫోన్ చేసి ఈ మాట కూడా చెప్పారు. అక్కడ బీఆర్ఎస్ తరపున ఎనిమిది మంది కార్పొరేటర్లు గెలిచారు. వారితో మాట్లాడకముందే.. ఖమ్మం జిల్లా నేత అభిప్రాయాలు తెలుసుకోక ముందే ఈ ప్రకటన చేసేశారు.
అయితే ఈ మద్దతు సీపీఐ తీసుకుంటుందా లేదా అన్నది కేటీఆర్ ఆలోచించలేదు. ఎందుకంటే సీపీఐ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది. తెలంగాణలో మాత్రమే కాదు.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిలో ఉంది. గత ఎన్నికల్లో కూనంనేని.. కాంగ్రెస్ సపోర్టుతోనే కొత్తగూడెంలో గెలిచారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరలేదు. అందుకే ఎవరి దారిన వారు పోటీ చేశారు. ఇప్పుడు ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడింది. కానీ రెండు పార్టీలు కలిస్తే తిరుగులేని మెజార్టీ వస్తుంది.
పొత్తులో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్, సీపీఐ మేయర్ పదవిని పంచుకుని తమ బంధాన్ని కొనసాగించుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కూనంనేని పరోక్షంగా చెప్పారు. కేటీఆర్ ఫోన్ చేసి మద్దతు ఇస్తామని చెప్పారని కానీ.. తమ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామన్నారు. మేయర్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో లొల్లి పెట్టుకుని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు జాతీయ పార్టీ సిద్ధపడదు. గతంలో సీపీఐ మద్దతు కోసం గట్టిగా ప్రయత్నించి.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తుల ఆశ చూపి మునుగోడులో వారి మద్దతుతో బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత ఆ పార్టీ నేతలకు ప్రగతి భవన్ గేట్లు కూడా తెరవలేదు. వారు నిరాశతో కాంగ్రెస్ వెంట పోయారు. ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ మధ్య చిచ్చు పెట్టడానికి కేటీఆర్…తన ఎనిమిది మంది కార్పొరేటర్లను పాచికగా వాడుతున్నారు. కానీ అది వర్కవుట్ అయ్యేది కాదని ఎక్కువ మంది అభిప్రాయం.