తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల క్రెడిట్ కోసం కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ వాదన ప్రకారం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిబ్బన్ కట్ చేస్తున్న ప్రాజెక్టుల్లో 90 శాతం గత బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే సాధ్యమయ్యాయి. చనాకా-కొరాటా ప్రాజెక్టు నుంచి హైదరాబాద్లోని ఫ్లైఓవర్ల వరకు, అలాగే ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ల వరకు అన్నీ కేసీఆర్ హయాంలోనే పురుడు పోసుకున్నవని, కేవలం కలిసొచ్చిన కాలం వల్ల రేవంత్ రెడ్డికి ఆ అడ్వాంటేజ్ దక్కుతోందని కేటీఆర్ చెబుతున్నారు.
సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్ల కాలం అనేది ప్రాజెక్టుల రూపకల్పన, నిధుల సమీకరణ, నిర్మాణానికి సరిపోతుంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులను దాదాపు తుది దశకు తీసుకువచ్చింది. అయితే, ప్రజాస్వామ్యంలో అధికారం మారినప్పుడు, గత ప్రభుత్వ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత , హక్కు కూడా. కానీ, ఇక్కడ కేటీఆర్ ఆవేదన అంతా తమ పదేళ్ల కష్టాన్ని ప్రజలు మర్చిపోతారేమోనన్న ఆరాటం చుట్టూ తిరుగుతోంది. అందుకే ఆయన ప్రతి సందర్భంలోనూ ఇది మా విజయం అని ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
రాజకీయాల్లో ప్రారంభించిన వాళ్లదే క్రెడిట్ అనే ఒక అలిఖిత సూత్రం ఉంటుంది. శంకుస్థాపన చేసిన వారు ఎంత కష్టపడినా, ఆ ఫలాలు ప్రజలకు చేరే సమయంలో అధికారంలో ఉన్నవారే ఆ ఘనతను సొంతం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో ఆగిపోయిన పనులను వేగవంతం చేసి, తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది కేటీఆర్కు మింగుడు పడటం లేదు. తమ హయాంలో పడిన పురిటి నొప్పులు, చేసిన వ్యూహరచనలను ప్రస్తుత ప్రభుత్వం హైజాక్ చేస్తోందనేది ఆయన బాధ.
ప్రాజెక్టును ఎవరు ప్లాన్ చేశారు.., ఎవరు నిధులు ఇచ్చారు, ఎవరు పూర్తి చేశారు అనే సాంకేతిక అంశాల కంటే.. తమకు ఆ సౌకర్యం ఎవరి హయాంలో అందుబాటులోకి వచ్చిందనే దానికే ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఏదైనా ప్రాజెక్టులు చేపడితే ఎన్నికలకు ముందే పూర్తి చేసి ప్రారంభించేయాలన్న సూత్రాన్ని అధికార పార్టీలు పాటించాలి.