రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఆవేశం లేదా వ్యక్తిగత కోపంతో అసలు సాధ్యం కాదు. ఆలోచననే ఎదుర్కోవాలి. కేసీఆర్ గైర్హాజరీలో రేవంత్ ను ఎదుర్కొంటున్న కేటీఆర్..రోజులు గడుస్తున్న రేవంత్ రాజకీయాన్ని అర్థం చేసుకోలేక ఇరుక్కుపోతున్నారు. సోమవారం అసెంబ్లీలో అదే కనిపించింది. అందరూ కేటీఆర్ గురించి వ్యతిరేకంగా చెప్పుకునేలా.. రేవంత్ ను అభినందించేలా ఒక్క సన్నివేశంతో సీన్ మారిపోయింది.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అందరి కంటే ముందే వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు. సభ ప్రారంభమయ్యే ముందు సీఎం రేవంత్ వచ్చారు. సభలో వచ్చీ రావడంతోనే కేసీఆర్ ను చూసి నేరుగా ఆయన వద్దకే వెళ్లారు. ప్రతిపక్ష్ నేతను అలా అసెంబ్లీలో చూడటం అదే మొదటి సారి. వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించి యోగక్షేమాలు అడిగారు. ఆ సమయంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేలు అందరూ లేని నిలబడ్డారు. కానీ కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రమే లేచి నిలబడలేదదు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. కౌశిక్ రెడ్డి లేవడానికి ప్రిపేర్ అయినా కేటీఆర్ లో చలనం లేకపోవడంతో.. తాను ఒక్కడినే లేచి నిలబడితే కేటీఆర్ వద్ద మార్కులు పోతాయని ఆయన కూడా లేవలేదు.
తన తండ్రిని సభాసంప్రదాయాల ప్రకారం సీఎం గౌరవిస్తూంటే.. కనీసం సభా మర్యాదలు కూడా పాటించాలని కేటీఆర్ అనుకోలేకపోయారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆవేశాన్ని ఇలా రేవంత్ ఎక్స్ పోజ్ చేసినట్లయింది. ఆయనపై సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. రాజకీయాలు ఎలా ఉన్నా వ్యక్తిగత గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలని సలహా ఇస్తున్నారు.
కేసీఆర్ ను రేవంత్ ప్రత్యేకంగా గౌరవించడంపై కేటీఆర్ కూడా చిట్ చాట్ లో స్పందించారు. కేసీఆర్ కు గౌరవం ఇవ్వడం మంచిదేనని రాజకీయంగా కూడా అలాగే ప్రవర్తించాలన్నారు. కేటీఆర్ కు రాజకీయం రాజకీయమే.. వ్యక్తిగతం.. వ్యక్తిగతమే అన్న తేడా చూడలేకపోతున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇలా అయితే కేటీఆర్.. రేవంత్ రాజకీయాన్ని తట్టుకోలేరని తేల్చేస్తున్నారు. ఒక్క రోజు అసెంబ్లీ ఘటన కేటీఆర్‌కు మైనస్‌గా మారింది.