బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా ఒక్కరికే కాదు..మరో నలుగురు ఐదుగురు కేంద్ర మంత్రులకూ లేఖలు రాశారు. తాను చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ లేఖలో పొందుపరిచారు. ముఖ్యంగా KLSR ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ ముఖ్యమంత్రికి బినామీ సంస్థ అని, అది దివాలా తీసిన స్థితిలో ఉన్నప్పటికీ సుమారు రూ. 2,500 కోట్ల విలువైన భారీ కాంట్రాక్టులను దానికి అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని KLSR కంపెనీపై ఉన్న కేసుల సాక్ష్యాధారాలను మాయం చేయిస్తున్నారని కేటీఆర్ లేఖలో చెప్పారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణమని, ఇది అధికారులపై ముఖ్యమంత్రి చేస్తున్న ఒత్తిడికి సాక్ష్యమన్నారు. గతంలో కూడా కేటీఆర్ అమృత్ టెండర్లు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చే శారు. ప్రతి అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రితో ముడిపెడుతూ, కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరడం ద్వారా రాష్ట్ర స్థాయి అంశాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని ఈ ఫిర్యాదులపై కాంగ్రె్స నేతలు అంటున్నారు.
రాష్ట్రంలోని ఏ చిన్న కుంభకోణం జరిగినా అది ముఖ్యమంత్రి బినామీల పనే అని ప్రచారం చేయడం ద్వారా, ప్రజల్లో ప్రభుత్వంపై అపనమ్మకం కలిగించే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తోంది. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తాము ప్రధాన ప్రతిపక్షంగా దూకుడుగా ఉన్నామని క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ ఫిర్యాదుల్లో ఎంతవరకు సాంకేతిక ఆధారాలు ఉన్నాయన్నది పక్కన పెడితే, రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డిని అవినీతి ముద్ర లో బంధించేందుకు ఇదొక ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
