సిరిసిల్ల నియోజకవర్గంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల ప్రత్యేక దృష్టి సారించారు. వారం వారం వెళ్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో పదేళ్ల పాటు ఆయన సిరిసిల్లకు నెలకు ఒక్క సారి వచ్చినా గొప్పే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
క్యాడర్నుకా పాడుకునేందుకు ప్రత్యేక దృష్టి
గత పదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని కేటీఆర్ గట్టిగా నమ్ముతారు. కానీ ఎన్నికల రాజకీయాల్లో అభివృద్ధికి .. పాలనకు సంబంధం ఉండదు. మారిన రాజకీయ సమీకరణాలు , ఇటీవలి ఎన్నికల ఫలితాలు ఆయనను ఆత్మరక్షణలో పడేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ గెలవలేదు. కానీ పోటీ ఇచ్చింది. ఈ ఫలితాలు కేటీఆర్ ను షాక్ కు గురి చేశాయి. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ సాఫీగా సాగిపోయినా, ఇప్పుడు విపక్షంలో ఉండటంతో క్షేత్రస్థాయి కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ వలసలను అడ్డుకోవడానికి , క్యాడర్లో భరోసా నింపడానికి కేటీఆర్ నిరంతరం ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
తప్పుదిద్దుకునే ప్రయత్నమా?
అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టిన దృష్టి, స్థానిక నాయకత్వంతో సమన్వయంపై పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రజలకు దూరమవ్వడం, కొన్ని వర్గాల్లో పెరిగిన వ్యతిరేకతను కేటీఆర్ ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తప్పు దిద్దుకోవడం నే కంటే, ప్రజలతో తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాలు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం ద్వారా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటాననే సంకేతాన్ని పంపిస్తున్నారు.
వ్యూహాత్మక అడుగులే !
పరిస్థితులు అనుకూలంగా లేదనందున కేటీఆర్ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సిరిసిల్ల కేటీఆర్కు కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, ఆయన రాజకీయ బలానికి అది ఒక నమ్మకమైన కోట. ఆ కోటలో పగుళ్లు రాకుండా చూసుకోవడం ఆయన బాధ్యత. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోకపోతే, అది భవిష్యత్తులో కేటీఆర్ నాయకత్వానికే సవాలుగా మారే ప్రమాదం ఉంది. అందుకే, ముందస్తు జాగ్రత్తగా ఆయన సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ముందు కూడా ఆయన ఎక్కువగా సిరిసిల్లలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.
