తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి హరీష్ రావు, కేటీఆర్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వార్పైనే ఉంది. సాధారణంగా అధికార పక్షంపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు పరిపాటే, కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు ఇద్దరూ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా పొంగులేటినే టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ వైరం మాత్రమే కాదని, దీని వెనుక గతంలో జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్ల కోణం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
ముఖ్యంగా మేఘా గ్రూపుతో కేటీఆర్‌కు ఉన్న సంబంధాల గురించి పొంగులేటి హింట్స్ ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. తాను బీఆర్ఎస్లో ఉన్న సమయంలో జరిగిన కొన్ని పనులకు సంబంధించి, ప్రస్తుతం పొంగులేటి తన దగ్గర ఉన్న చిట్టా బయటపెడతారేమో అన్న భయం గులాబీ నేతల్లో ఉందనే వార్తలు వస్తున్నాయి. పొంగులేటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. వారికేదో కావాలి, అందుకే నాపై పడుతున్నారు అన్నట్లుగా వ్యాఖ్యానించడం, వారి మధ్య ఉన్న పాత పద్దుల వైపు వేలెత్తి చూపుతోంది.
మరోవైపు నాదర్ గుల్ భూముల వ్యవహారం ఈ రచ్చను మరింత పెంచింది. పొంగులేటి గతంలో బీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆ భూముల మ్యూటేషన్లు జరగడం, వాటి వెనుక ఉన్న క్విడ్ ప్రో కో వ్యవహారాలపై ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమయంలో జరిగిన ఒప్పందాల్లో ఏదైనా తేడా వచ్చిందా? లేక ఇప్పుడు పొంగులేటి మంత్రిగా పాత ఫైళ్లు తిరగేస్తున్నారన్న కంగారు బీఆర్ఎస్లో మొదలైందా? అన్న కోణంలో గాసిప్స్ ప్రారంభమయ్యాయి.
గతంలో తమతో సన్నిహితంగా ఉండి, ఇప్పుడు తమ గుట్టుమట్లు తెలిసిన వ్యక్తి ప్రత్యర్థిగా మారడం బీఆర్ఎస్ నేతలకు మింగుడుపడటం లేదని అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దాడి చేయడం కంటే పొంగులేటిని వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా హరీష్, కేటీఆర్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. పొంగులేటి కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఎదురుదాడి చేస్తూ, లోపాయికారీగా జరిగిన వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరిస్తుండటం తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ బిజినెస్ అండ్ పొలిటికల్ వార్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.