ఎన్నికల సమయంలో రాజకీయ నేతల వ్యూహాలు రివర్స్ అవకుండా ఉండకూడదంటే చాలా పక్కాగా ఉండాలి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరవాత అనుమానాలు వ్యక్తం చేయడం, వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చారని ప్రచారం చేయడం, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా ఉంటున్నారని చెప్పడం వంటివి ఓటమికి కారణాలుగా ప్రచారంలోకి వెళ్లిపోతాయి. ఇప్పుడు కేటీఆర్ అదే చేస్తున్నారు.
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఇరవై వేల దొంగ ఓట్లు చేర్చారని చెప్పి కేటీఆర్..నేరుగా సీఈవోకు ఫిర్యాదు చేశారు. దానికి ప్రాతిపదిక ఏమిటంటో ఓ ఇంట్లో నలభై ఓట్లు ఉన్నాయని.. అవన్నీ దొంగ ఓట్లేనని ఆయన వాదన. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ గురించి ప్రచారం చేస్తున్నారని కానీ జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ చేసిందని ఆయన అంటున్నారు.
కేటీఆర్ ఇప్పటికే తన ప్రచారానికి హైడ్రాను ఆయుధంగా వాడుకుంటున్నారు. తమకు ఓటేయడం వల్ల ఏం జరుగుతుందో చెప్పడం లేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే హైడ్రా వస్తుందని ఇళ్లు కూల్చేస్తుందని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని చెబుతున్నారు. ఆ వ్యతిరేకతతో తమకు ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. ఇలా పూర్తిగా కేటీఆర్ నెగెటివ్ పద్దతిలో జూబ్లిహిల్స్ ప్రచారం చేయడం .. కాస్త తేడాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎప్పుడూ లేనంత బలమైన అభ్యర్థి దొరికాడన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో.. కేటీఆర్, హరీష్ రావు ..డిఫెన్సివ్ రాజకీయాలు చేస్తే.. కోలుకోవడం కష్టమవుతుంది.