తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీతో ఎవరైనా భూములు రెగ్యులరైజ్ చేసుకుంటే తమ ప్రభుత్వం రాగానే వెనక్కి తీసుకుంటుందని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయా పరిశ్రమల వద్దకు కేటీఆర్ వెళ్లే కార్యక్రమం చేపట్టారు. అక్కడ కార్మికులతో మాట్లాడి.. మిమ్మల్ని రోడ్డున పడేస్తున్నారని.. రియల్ ఎస్టేట్ కు ఫ్యాక్టరీ స్థలాలు అమ్మేస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పారిశ్రామిక వేత్తల్ని బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
ఓ ప్రభుత్వం వద్ద ఏదో రూపంలో తీసుకున్న భూముల్ని రద్దు చేసి వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. కానీ ప్రభుత్వ నిర్ణయాలను అమలు కాకుండా.. పారిశ్రామికవేత్తలు ముందుకు రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోకాపేట భూములను వేలం వేసినప్పుడు..తాము వచ్చాక వెనక్కి తీసుకుంటామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇంకా విశేషం ఏమిటంటే..ఆ భూములేవి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎప్పుడో దశాబ్దాల కిందటే ఆ భూముల్ని పరిశ్రమలకు ఇచ్చారు. అప్పట్లో అవి శివారు ప్రాంతాలు. ఇప్పుడు సిటీలోకి వచ్చాయి. ఆ భూముల్ని మల్టీ యూజ్ గా మార్చేందుకు ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకు వచ్చింది. కేటీఆర్ కొత్త చట్టాలు తెచ్చినా అవి రాజ్యాంగ విరుద్ధమే అవుతాయి కానీ.. భూముల్ని వెనక్కి తీసుకోలేరు.
హిల్ట్ పాలసీని ఓ పెద్ద భూస్కాంగా చూపించాలని కేటీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు పరిశ్రమల భూముల్ని ప్రభుత్వం ఎలా అమ్ముతుందన్న చిన్న సందేహం ప్రజలకు వస్తుందని అనుకోకుండా.. జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై తమకు కేబినెట్ నిర్ణయం తీసుకోకముందే తమకు ఓ తెలంగాణ బిడ్డ సమాచారం ఇచ్చారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆ తెలంగాణ బిడ్డను నట్టేట ముంచినట్లుగా మాత్రం ఆయన చెప్పలేకపోయారు.