కేటీఆర్కు ఆత్రమే కానీ రాజకీయ పరిజ్ఞానం కనీస మాత్రంగా లేదని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐ అడగక ముందే తమ పార్టీ తరపున గెలిచిన ఎనిమిది మంది కార్పొరేటర్ల మద్దతును ఆ పార్టీకి ప్రకటించేయడం. ఇప్పుడు సీపీఐ.. బీఆర్ఎస్ పార్టీ మద్దతును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. వెళ్లి తమ మిత్రపక్షం కాంగ్రెస్ తోనే డీల్ కుదుర్చుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునేందుకు ఆ రెండు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తొందరపడి సీపీఐకి ఆఫర్ ఇచ్చి కేటీఆర్ నవ్వుల పాలయ్యారు.
రాజకీయ నేతలకు తొందరపాటు ఉండకూడదు. ముఖ్యంగా తమ మద్దతును అయాచితంగా ఎవరికీ ప్రకటించకూడదు. అదీ కూడా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. తాము ఎవరిపై పోరాడామో.. వారికి మద్దతు ప్రకటించడం అంటే వ్యూహాత్మకంగా రాజకీయ తప్పిదం. కొత్తగూడెం డైనమిక్స్ పై ఏ మాత్రం అనగాహన ఉన్నా.. కేటీఆర్ అలాంటి ప్రకటన చేసి ఉండేవారు కాదు. కానీ సీపీఐని.. కాంగ్రెస్ నుంచి దూరం చేయాలన్న ఒకే ఒక్క టార్గెట్ తో బీఆర్ఎస్ పార్టీని అవమానించుకోవడానికి కేటీఆర్ రెడీ అయ్యారు.
కానీ సీపీఐకి .. గతంలో బీఆర్ఎస్ చేసిన అవమానాలు గుర్తుండే ఉండి ఉంటాయి. అయితే వారేమీ రివర్స్ లో అవమానించాలని అనుకోలేదు. కేటీఆర్ స్వయంగా ఫోన్ చేశారు.. మద్దతు ప్రకటించారు కానీ.. తమ మిత్రపక్షంతో మాత్రమే తాము రాజకీయం చేస్తామని తేల్చేశారు. కేటీఆర్ చేసుకున్న స్వీయ అవమానమే ఇది. ఇప్పుడు కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీకి విలువ ఎక్కడ ఉంటుంది?. ఏ మాత్రం వ్యూహం లేని రాజకీయాలు చేసి కేటీఆర్ రాను రాను తనతో పాటు తన పార్టీని కూడా చులకన చేసుకుంటున్నారు. ఆ విషయం మరోసారి నిరూపితమయింది.
