కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. అది మొత్తం రేవంత్ కు వ్యతిరేకంగా ఉందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎక్కడా ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పలేదు. అనుమతులు లేకుండానే చెట్లు ఎలా నరికివేశారు అని ప్రశ్నించగా.. తాము అనుమతి తీసుకునే నరికివేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు వివరించారు.
డజన్ల కొద్ది బుల్డోజర్లతో చెట్లు నరికారని, వారాంతంలో చెట్లు నరకడంలో అంతర్యం ఏమిటి అని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, సుస్థిరమైన అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కాకపోతే అక్కడ పర్యావరణాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. లేదంటే అధికారులు జైలుకు వెళ్ళాల్సి వస్తుందని కామెంట్స్ చేసింది.
తాము అనుమతి తీసుకునే చెట్లను నరికివేశామని ప్రభుత్వం ఫైల్ ను సుప్రీంకోర్టుకు అందిస్తే ఎవరిపై ఎలాంటి చర్యలు ఉండవు. సరికదా ఆ తర్వాత ఈ స్థలం విషయంలో ప్రభుత్వం ఏం చేసుకుంటుంది అన్నది ప్రభుత్వ నిర్ణయానికి వదిలేసే చాన్స్ ఉండొచ్చు అంటున్నారు న్యాయనిపుణులు. ఎందుకంటే ల్యాండ్ ప్రభుత్వానిది అయినప్పుడు..అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటే కోర్టు అబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉండకపోవచ్చు.
దీంతో ఈ కేసులో తదుపరి విచారణలో ప్రభుత్వానికి ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ కామెంట్స్ చేసిందో, వేటిని బేస్ చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేసిందో తెలుసుకోకుండా రేవంత్ తన తప్పును ఇకనైనా అంగీకరించాలంటూ కేటీఆర్ వక్రభాష్యాలు చెప్తున్నారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను అర్థం చేసుకోవడంలో కేటీఆర్ పొరబడుతున్నారని , ఆయనకు ఆయన కోటరీ , సోషల్ మీడియా వ్యూహకర్తలు అర్థం చేయించాలని సెటైర్లు వినిపిస్తున్నాయి.