ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతూ ఉంటారు… హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి కారణం తన హయాంలో జరిగిన కృషి అంటారు. తన చొరవతోనే ఈరోజున హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని వివరిస్తుంటారు. అయితే, ఇప్పుడు అదే మాటను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం విశేషం. హైదరాబాద్ లో జరిగిన టెక్ మహింద్రా ఎమ్.ఐ. సంస్థ 18వ వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి కారణం చంద్రబాబు నాయుడే అని కేటీఆర్ చెప్పారు. భాగ్యనగరానికి ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. ప్రపంచంలో ఒక ఐటీ హబ్ గా ఈరోజున హైదరాబాద్ నగరం గుర్తింపు పొందుతోందంటే, దానికి కారణం చంద్రబాబు కృషి అని చెప్పారు.
హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన క్రెడిట్ తాను తీసుకోలేననీ, ఆ ఘనత అంతా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది చెప్పారు. 17 ఏళ్ల కిందట చంద్రబాబు బిల్ గేట్స్ దగ్గరకి వెళ్లారనీ, ఆయనతో చర్చలు జరిపి ఒప్పించారనీ, ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థని హైదరాబాద్ కు రప్పించారు అని చెప్పారు. ఈరోజున హైదరాబాద్ కు ఇంత గుర్తింపు వస్తోందంటే కారణం గతంలో ఆయన చూపించిన చొరవ, చేసిన కృషి అన్నారు. గతంలో ఆయన అంత కృషి చేసి ఉండకపోయి ఉంటే, ఇవాళ్ల హైదరాబాద్ కు ఈ స్థాయి గుర్తింపు ఉండేది కాదేమో అని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధి కృషి చేసిన క్రెడిట్ కచ్చితంగా చంద్రబాబుకు దక్కుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు హైటెక్ సిటీ కావొచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావొచ్చు, హైటెక్ కన్వెన్షన్ సెంటర్ కావొచ్చు.. ఇలాంటివన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హయాంలో మొదలైన అభివృద్ధి కార్యక్రమాలే. అయితే, ఇంతవరకూ ఆ క్రెడిట్ గురించి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు తెరాస మంత్రి కేటీఆర్ నాటి చంద్రబాబు కృషిని మెచ్చుకుంటూ మాట్లాడటం కచ్చితంగా విశేషంగానే చెప్పుకోవచ్చు. ఈ తరహాలో గతంలో తెరాస ప్రముఖులు ఎవ్వరూ మట్లాడింది లేదూ, చంద్రబాబు కృషిని మెచ్చుకుందీ లేదు! కాబట్టి, ఈ సందర్భాన్ని ప్రత్యేకంగానే చూడొచ్చు.