ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా సరే కేటీఆర్ ఉత్సాహంగా ఉన్నారు. ఫలితం అధికారికంగా ప్రకటించకముందే తెలంగాణ భవన్ లో ప్రెస్మీట్ పెట్టారు. తనలో నిరాశ ఎక్కడా కనిపించలేదు. అలా కనిపించకుండా ఆయన చూసుకున్నారని కూడా అనుకోలేరు. ఎందుకంటే ఆయన నిజంగానే సంతోషంగా ఉన్నారు. అందరికీ ధ్యాంక్స్ చెప్పారు. కేటీఆర్ ఆనందం ఎందుకో ఆయన మాటల్లోనే స్పష్టం అయింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకున్నామని.. ఓడిపోయినా 38 శాతం ఓట్లు వచ్చాయన్నారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని గుర్తు చేశారు. అంటే తమ పార్టీ కరిగిపోతుందని.. కనుమరుగు అయిపోతుందని ఇక ప్రచారం జరగదని.. తామే ప్రత్యామ్నాయంగా ఉంటాయమన్న భరోసాకి ఆయన వచ్చారు. బీజేపీ ఎదగదని…తమ స్థానాన్ని ఆక్రమించదని ఆయనకు ధైర్యం వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇతర చోట్లా ఉనికి కోల్పోతుంది కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి తామే గెలుస్తామన్న నమ్మకాన్ని పెంచుకున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవలేదు సరి కదా.. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. కేటీఆర్ ఇదే గుర్తు చేసి ..తమలో కూడా ఆ ధైర్యం ఉందని చెప్పుకున్నారు. ప్రధానప్రతిపక్షంగా తమ బాధ్యత ఇక ముందు కూడా నిర్వర్తిస్తామని ఆయన చెప్పారు. మాగంటి సునీత ఈ ఫలితంపై తీవ్రంగా స్పందించారు. ఇది అసలు గెలుపు కాదన్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఓడిపోయినా పర్వాలేదు.. ప్రత్యామ్నాయంగా ఉన్నామని సంతోషపడుతున్నారు.

