బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును ఆ పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా కూడా జాతిపిత అంశంమే హైలెట్ అయింది. కేసీఆర్ తెలంగాణ జాతికి పితా అని బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణించగా, దానికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.
కేసీఆర్ పుట్టినరోజున సీఎం రేవంత్ రెడ్డి .. కేసీఆర్ ఏ జాతికి జాతిపిత అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు నిజమైన జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదని, కోట్లాది మంది ఆకాంక్షలు, సోనియా గాంధీ నిర్ణయం వల్ల రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణ సాధించిన ఉద్యమ నేతను అవమానించడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నాయకత్వానికి బానిసలుగా మారిన వారు తెలంగాణ జాతిపిత గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పుట్టినరోజున కూడా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్నప్పుడు జరిగే పుట్టిన రోజు వేడుకలకు.. అధికారం పోయిన తర్వాత జరిగే వేడుకలు చాలా తేడా ఉంటుంది. ఆ తేడా కేసీఆర్ పుట్టినరోజున కూడా కనిపించింది. చాలా మంది నేతలు మున్సిపల్ ఎన్నికల పరాజయంలో కేసీఆర్ బర్త్ డేను పట్టించుకోలేదు. పట్టించుకున్న వారు.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నారు.