ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై విచారణకు హాజరయ్యే సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన ట్యాపింగ్ జరిగింది కానీ దానితో తమకు సంబంధం లేదని అంతా పోలీసులే చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ ను సమర్థించుకుంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్ర హోంశాఖ కూడా ఫోన్లు ట్యాప్ చేస్తుందని అంతర్గతభద్రతకు భంగం వాటిల్లేలా ఉంటే అనుమానం ఉన్నవారిపై ఫోన్లు ట్యాప్ చేస్తుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై ఎవరైనా కుట్రలు చేస్తే..ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా కుట్రలు చేస్తే పోలీసులు వారి ఫోన్లు ట్యాప్ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇస్తుందన్నారు. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని తాము అడగమన్నారు. ట్యాపింగ్ చేసేది తాము కాదని పోలీసులేనని చెప్పుకొచ్చారు. చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేసి ఉంటే ఆధారాలు చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విచారణకు బరాబర్ హాజరవుతానని.. ఇప్పుడు తన ఫోన్ ట్యాప్ కావడం లేదా అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నిస్తానని కేటీఆర్ అంటున్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని కేటీఆర్ సవాల్ చేశారు.
కేటీఆర్ తీరు పోలీసు వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి. కేసీఆర్ హయాంలో అత్యంత కీలకపాత్రల్లో ఉన్న నాటి డీజీపీ మహేందర్ రెడ్డి, కొంత కాలం ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన శివధర్ రెడ్డిలే ట్యాపింగ్ చేయించారన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే తాము దొరికిపోవడం ఖాయం కాబట్టి వారిని అడ్డం పెట్టుకోవాలన్నట్లుగా కేటీఆర్ వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్ర హోంశాఖ చేసే ట్యాపింగ్ కు.. రాష్ట్రంలో రాజకీయ కుట్రలకు చేసే ట్యాపింగులకు చాలా తేడా ఉంటుంది.
శుక్రవారం విచారణకు కేటీఆర్ సాక్షిగా వెళ్లడం లేదు. ఆయనను నిందితుడిగానే పోలీసులు చూడబోతున్నారు. పక్కా ఆధారాలతోనే పోలీసులు రెడీ అవుతున్నారని హరీష్ రావు విచారణను బట్టి బీఆర్ఎస్ నేతలకు అర్థమయింది. అందుకే ట్యాపింగ్ జరిగింది కానీ పోలీసులే చేశారన్నట్లుగా కేటీఆర్ వాయిస్ మారుస్తున్నారు. అంటే శుక్రవారం నాటకీయ పరిణామాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
