బీఆర్ఎస్ లో జరుగుతోన్న పరిణామాలపై సీనియర్ నేత హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారని కేటీఆర్ తేల్చేశారు. అనూహ్యంగా హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లడం, ఆయనతో రెండుగంటలపాటు భేటీ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం రాజకీయాలు అంత వాడివేడిగా కూడా లేవు. అయినా ఈ సమయంలో హరీష్ నివాసానికి వెళ్లడంతో బుజ్జగింపుల కోసమే వెళ్లారని ప్రచారం మరింత ఎక్కువైంది.
కొద్ది రోజులుగా హరీష్ బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారని, హరీష్ రావు – కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని ప్రచారం నడిచింది. వీటిని ఖండిస్తూ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీష్ తనకు కేసీఆర్ మాటే శిరోధార్యం అని, ఆయనతో చివరివరకు ఉంటానని తెగేసి చెప్పారు. ఆయన లైన్ లోనే కొనసాగుతానని పార్టీ మార్పు వార్తలను ఖండించారు.
కేటీఆర్ తో ఆధిపత్య పోరు నడుస్తుంది అనే ప్రచారంపై హరీష్ పరోక్షంగా స్పందిస్తూ కేటీఆర్ కు తన నుంచి సంపూర్ణ సహకారం కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ కారణంగానే కృతజ్ఞతలు చెప్పేందుకు హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లారు అనే వాదనలూ వినిపిస్తున్నాయి.
పార్టీ మార్పు వార్తలు ఖండించిన తర్వాత కూడా హరీష్ పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో ఇక నుంచి కలిసి సాగుదామని కోరేందుకు హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఉన్నపళంగా హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త ప్రచారాన్ని మరోసారి తెరమీదకు తెచ్చినట్లుగా అయింది.