బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లకు లీగల్ నోటీసులు పంపారు. ఐదు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తానని గంభీరంగా హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అయితే, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై వచ్చే రాజకీయ ఆరోపణలను లీగల్ నోటీసులతో ఎదుర్కోవాలని అనుకోవడమే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. సాధారణంగా రాజకీయాల్లో ఇద్దరు నేతల మధ్య జరిగే వాగ్వాదాలు ప్రజల మధ్యే తేలాలి కానీ, చిన్న విషయానికి కూడా న్యాయపరమైన నోటీసులు పంపడం కేటీఆర్ బలహీనతను సూచిస్తోంది.
నోటీసుల విలువేముంది?
గతంలోనూ కేటీఆర్ పలుమార్లు తనపై ఆరోపణలు చేసిన నేతలకు ఇలాంటి లీగల్ నోటీసులు పంపారు. ఆ కేసులు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి తప్ప, ఏ ఒక్కటీ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా విమర్శలను తిప్పికొట్టలేక, కేవలం భయపెట్టడమే లక్ష్యంగా నోటీసులు పంపడం వల్ల ప్రయోజనం ఉండదని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరో పదిసార్లు అంటాం.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బీజేపీ నేతలు తిరిగి సవాళ్లు విసరడంతో, ఈ నోటీసుల వల్ల కేటీఆర్ ఆశించిన ఫలితం రాకపోగా, ఆయన రాజకీయ వ్యూహాలపై ఇతరులకు డౌట్స్ వస్తాయి.
రాజకీయ విమర్శలు – న్యాయ పోరాటాలు
ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశాలు చర్చకు వచ్చినప్పుడు, ప్రజాప్రతినిధులుగా బీజేపీ నేతలు తమకు తెలిసిన సమాచారాన్ని బయటపెట్టడం సహజం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆరోపణలను రాజకీయంగానే ఖండించాలి. కానీ, కేటీఆర్ మాత్రం ప్రతిదానికీ లాయర్లను ఆశ్రయించడం ద్వారా ప్రత్యర్థులకు మరింత అవకాశం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నేను నోటీసులకు భయపడను అని బండి సంజయ్ వంటి నేతలు పదే పదే చెప్పడం ద్వారా, కేటీఆర్ పంపుతున్న నోటీసులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో ఆయనకు మైలేజీని ఇవ్వడం లేదు.
చులకన అవుతున్న ఇమేజ్?
కేటీఆర్ ఇలాంటి చిన్నపాటి రాజకీయ ఆరోపణలకు కూడా కోర్టు నోటీసులతో బెదిరించే ప్రయత్నం చేయడం ఆయన స్థాయికి తగదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ప్రజల్లో నిరూపించలేక, న్యాయస్థానాల వెనుక దాక్కోవడం వల్ల ప్రజల్లో ఆయన ఇమేజ్ చులకన అయ్యే అవకాశం ఉంది. రాజకీయ పోరాటం అసెంబ్లీలోనో, రోడ్ల మీదో జరగాలి కానీ, లాయర్ల ఆఫీసుల్లో కాదని సామాన్య జనం చర్చించుకుంటున్నారు. కాస్త రివర్స్ లో ఆలోచిస్తే.. కేటీఆర్ ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేసి ఉంటారో అంచనా వేయడం కష్టమే.
