ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు, డాక్టర్ మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ప్రియుడు వేరే డాక్టర్ ను వివాహం చేసుకోవడంతో, ఆ క్షణం నుంచే సదరు ప్రియురాలి మనసులో కక్ష పెరిగింది. తను ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదన్న ఆవేదన కంటే, ఆ వ్యక్తిని దక్కించుకున్న మరో మహిళపై ఆమెలో అసూయ కట్టలు తెంచుకుంది. అది ఎంతటి దారుణానికి దారితీసిందంటే.. అవతలి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆమె ఒక భయంకరమైన కుట్రకు తెరలేపింది. హెచ్ఐవీ రక్తం ఎక్కించింది. కర్నూలులో ఈ ఘోరం జరిగింది.
ఇటీవల ఓ మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఢీకొట్టారు. ఆ డాక్టర్ కిందపడిపోవడంతో అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కించేందుకు సాయం చేశారు. ఆ సమయంలో ఆ మహిళా డాక్టర్‌కు ఆ ముగ్గురిలో ఒకరు ఓ ఇంజక్షన్ చేశారు. ఆ మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేయగా, వారు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇదేదో వింత కేసుగా ఉందని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
వసుంధర అనే నర్సు సుపారీ మాట్లాడుకుని డాక్టర్ కు హెచ్ ఐవీ రక్తం ఎక్కించేలా ముఠాను పంపింది. ఆమె లవ్ స్టోరీ కూడా అప్పుడే వెలుగులోకివచ్చింది. ప్రాణం తీయడం కంటే, ప్రతిరోజూ మరణం అంచున బతికేలా చేయాలన్న ఆమె క్రూర ఆలోచన అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమలో విఫలమయ్యానన్న కక్షతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఆమె అంగీకరించింది.
శాస్త్రీయంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు వెంటనే చికిత్స అందిస్తే వైరస్ ప్రభావాన్ని అడ్డుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమ అంటే దక్కించుకోవడం కాదు, అవతలి వారి సంతోషాన్ని కోరుకోవడం అనే కనీస స్పృహ కోల్పోయిన ఉన్మాదానికి ఇది పరాకాష్టగా మారింది.