కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాల్లో బీజేపీ వైపు నుంచి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయకు ఏకపక్షంగా మద్దతు లభిస్తోంది. తాజాగా తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు , సినీ నటి ఖుష్బూ విజయకు మద్దతు పలికారు. కరూర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం చేసిందని ఆమె ఆరోపిస్తున్నారు. విజయ్ యాత్రకు సరైన స్థలం ఇవ్వకపోగా.. లాఠీచార్జి చేశారని అంతా ప్రణాళిక ప్రకారం చేశారని ఆమె అంటున్నారు. చాలా వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు.
బీజేపీ తరపున .. విజయ్‌కు పూర్తి మద్దతుగా మాట్లాడిన వారిలో ఖుష్బూ మొదటి వారు కాదు. మొత్తం బీజేపీ నేతలు … దళపతికి మద్దతు ఇవ్వడానికి పోటీపడుతున్నారు. అన్నామలై అందరి కంటే ముందు విజయ్ కోసం రంగంలోకి దిగారు. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించుకున్న టీవీకే పార్టీ అధ్యక్షుడుకి ఇది సంకట పరిస్థితే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారి సపోర్టును విజయ్ కాదనలేరు.
బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్ కు ఫోన్ చేసి.. డీఎంకే ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తే తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన అరుణా జగదీశన్ కమిటీతో పాటు.. హైకోర్టు ఆదేశంతో సిట్ కూడా దర్యాప్తు జరుపుతోంది. ఈ రిపోర్టుల్లో విజయ్ పార్టీ నిర్లక్ష్యం బయటపడితే రాజకీయంగా ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన రావొచ్చు.