ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆప్తమిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విసిరిన రూ. 10 కోట్ల ఛాలెంజ్ తెలుగు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తనను తీవ్రంగా వేధించారని, తనపై అక్రమ కేసులు పెట్టాలని అప్పట్లో ఒక ఐపీఎస్ అధికారికి స్వయంగా పురమాయించారంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలపై వైఎస్సార్ ఆత్మగా పేరుగాంచిన కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ముమ్మాటికీ అబద్ధమని కొట్టిపారేసిన ఆయన.. ఆ వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి రూ. 10 కోట్లు విరాళంగా ఇస్తానంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్సార్ కుటుంబానికి, అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌పై ఇంతటి తీవ్రమైన నిందలు వేసినప్పుడు ఆయన వారసత్వాన్ని భుజాన వేసుకుని, ఆయన పేరు చెప్పుకుని ఓట్లు పొందుతున్న కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోపం రావాలి, రోషం రావాలి. కానీ, తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రత్యర్థులు మాట్లాడుతున్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి బలమైన కౌంటర్ రాలేదు. జగన్ రెడ్డికి ఆ ‘రాజకీయ నరం’ ఎప్పుడో తెగిపోయిందని, అందుకే ఆయనకు రాని కోపం వైఎస్సార్‌తో దశాబ్దాల అనుబంధం, నిఖార్సైన స్నేహం ఉన్న కేవీపీకి వచ్చింది. అందుకే కేవీపీ అసహనంతో.. వైసీపీకి ..వైఎస్‌కు సంబంధంలేదని.. వైసీపీని విమర్శించేందుకు వైఎస్‌పై నిందలేయవద్దని అంటున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ప్రతి చిన్న అంశం కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లోనే జరిగేదనేది బహిరంగ రహస్యం. వైఎస్సార్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరికి ఏ ఆదేశాలు ఇచ్చినా అందులో కేవీపీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేది. పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక ఐపీఎస్ అధికారిని పిలిచి వేధించమనే ఆదేశాలు వైఎస్సార్ ఇచ్చి ఉంటే.. ఆ విషయం కేవీపీకి తెలియకుండా జరిగే ఛాన్సే లేదు. ఆ నమ్మకంతోనే, తన మిత్రుడి క్యారెక్టర్ ఏంటో తనకు పూర్తిగా తెలుసు కాబట్టే.. కేవీపీ అంత గట్టిగా, అంతటి భారీ మొత్తాన్ని పణంగా పెట్టి పవన్‌కు సవాల్ విసిరారని భావిస్తున్నారు.
