ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నాయకులు ఎంతో ఆర్భాటంగా సన్నాహాలు జరిపి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో రెండు రోజుల క్రితం జరిపిన `రైతు సదస్సు’ బహిరంగ సభకు పెద్దగా స్పందన లభించక పోవడంతో ఆ పార్టీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. తగు రీతిలో రైతులను సమీకరించడం కోసం ప్రయత్నాలు చేయకుండా, పార్టీ నాయకులను అందరిని కలుపుకుపోయే ప్రయత్నం జరుపకుండా, ఏకపక్షంగా యధాలాపంగా చేసిన సన్నాహాలు అందుకు కారణంగా భావిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉండటమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు వచ్చిన సందర్భాంగా జరిగిన బహిరంగ సభ అంత పలుచగా జరగడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉన్నట్లు గుర్తిస్తున్నారు. పెద్దగా రైతులను సమీకరింప లేక పోవడం పట్ల అమిత్ షా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ఈ సభ రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడంతో గాని, రైతుల దృష్టిని ఆకట్టుకోవడంలో గాని విజయం సాధించలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
బిజెపి సన్నిహిత వర్గాల ప్రకారం రైతు సదస్సుకు హాజరైన వారి సంఖ్య 15 వేలకు లోపుగానే ఉంది. అధికారంలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడి బహిరంగ సభ ఈ విధంగా జరగడం అవమానకరమని పలువురు పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర బిజెపి లో నెలకొన్న ముఠా తగాదాలే సభ అంత పేలవంగా జరగడానికి దారితీస్తున్నట్లు పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న సందిగ్థత పరిస్థితులను తొలగించడం కోసం సత్వర చర్యలు అవసరమని ఈ విషయమై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు రావాలని కొందరు సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలుతెలిపాయి .
అమిత్ షా బహిరంగ సభకు తాడేపల్లిగూడెం ను వేదికగా నిర్ణయించడం పట్లనే రాష్ట్ర పార్టీలో తీవ్ర విబేధాలు చెలరేగిన్నట్లు తెలుస్తున్నది. ఎనిమిది నెలలక్రితమే అక్కడకు 50 కి మీ దూరంలో ఉన్న రాజముండ్రి లో అమిత్ షా తో పెద్ద బహిరంగ సభ జరపడం గమనార్హం. ఆ సభకు ఉభయ గోదావరి జిల్లాలలోని పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు తిరిగి అక్కడకు సమీపంలోనే బహిరంగ సభ జరపడంతో వారంతా ఆసక్తి కనబరచలేదని భావిస్తున్నారు.
పైగా వాణిజ్యకేంద్రంగా పేరొందిన తాడేపల్లిగూడెంలో రైతు సదస్సు జరపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రియాశీల రైతు ఉద్యమాలకు పేరొందిన విజయవాడ, గుంటూరు, భీమవరం వంటి నగరాలకు పరిసరాలలో జరిపి ఉంటె రైతుల నుండి మరింతగా స్పందన లభించి ఉండెడదని అంచనా వేస్తున్నారు.