సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ప్రమోషన్స్ కీలకం. మంచి కంటెంట్ ఉంటే జనాలు చూసేస్తారని అనుకోవడం పొరపాటే. ఆ కంటెంట్‌ను జనాల్లోకి చేరవేయడానికి కూడా ప్రమోషన్స్ కావాలి. సరైన ప్రమోషన్స్ లేని మంచి సినిమా కూడా వెనకబడిపోతుందని చెప్పడానికి లేటెస్ట్ ఉదాహరణ… మోహన్ లాల్ తుడరుమ్. ఏప్రిల్‌లో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను చడీచప్పుడూ లేకుండా విడుదల చేశారు. ఎంతమంది చూశారో తెలియదు. ప్రముఖ పోర్టల్స్‌లో రివ్యూలు కూడా కవర్ కాలేదు. అసలు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయారు.అంతకు ముందు ‘ఎంపురాన్’, ‘బరోజ్’ సినిమాలకు తెలుగులో సందడి చేశారు మోహన్ లాల్. కానీ ఈ సినిమాకే ఎలాంటి హైప్ లేదు. థియేటర్స్‌లో కూడా ఎలాంటి బజ్ కనిపించలేదు.
అయితే థియేటర్స్‌లో ఆడాల్సిన సినిమా ఇది. మలయాళంలో బాగానే కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా ఆడాల్సింది కానీ సరైన ప్రచారం లేకపోవడం వల్ల వెనుకబడిపోయింది. లేటెస్ట్గా ఓటీటీలో ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ కెరీర్లో మరో ‘దృశ్యం’ లాంటి థ్రిల్లర్ ఇది. మలయాళ రచయితలు ఒక పాత కథను కొత్తగా ట్రీట్ చేయడం భలే పట్టేశారు. కథ పరంగా చూస్తే… ఈ కథ చెబితే ఏ నిర్మాత సినిమా తీయడానికి ముందుకు రాడు. అంత పాత కథ. కానీ ఈ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ భలే థ్రిల్ ఇచ్చింది. కొత్త కథలు పుట్టవు ఉన్న కథలనే కొత్తగా చెప్పాలని మరోసారి రుజువుచేసిన సినిమా ఇది. బెంజ్ పాత్రలో మోహన్ లాల్, జార్జ్ పాత్రలో ప్రకాశ్ వర్మ నటన వేరే లెవెల్. ఆద్యంతం ప్రేక్షకుడిని కథనంలో లీనంగా పెట్టగలిగాడు దర్శకుడు తరుణ్ మూర్తి. మంచి ప్రమోషన్స్ ఉంటే థియేటర్స్‌లో బాగా ఆడే సినిమా ఇది. ఇప్పుడు జీయో హాట్ స్టార్ లోకి అందుబాటులోకి వచ్చింది. థ్రిల్లర్ చూడాలనుకునే ఆడియన్స్‌కి మంచి ఆప్షన్.