Laggam Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్-
‘బలగం’ సినిమా తెలంగాణ మట్టి కథలకు కొండత బలం ఇచ్చింది. నిజాయితీగా కథ చెప్పాలే కానీ ఒక ప్రాంతం మూలాల్లోని కథలు ప్రేక్షకుల్ని ఎంతలా పట్టేస్తాయో చూపించింది. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ఆచార సాంప్రదాయలతో కూడుకున్న కథలని రాయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సినీ రూపకర్తలు. లగ్గం సినిమా అదే స్ఫూర్తితో వచ్చిందని టైటిల్ చూస్తూనే అర్ధమైయింది. తెలంగాణ లో జరిగే పెళ్లిలోని ప్రతి క్రతువుని వివరంగా చూస్తూ ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు సోషల్ కామెంటరీ జోడిస్తూ ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు రమేష్ చెప్పాల. మరి ఈ కథ ప్రేక్షకుడిని హత్తుకుందా? ఈ పెళ్లి ప్రేక్షకుడికి వేడుకలా అనిపించిందా?
అది తెలంగాణలోని ఓ పల్లెటూరు. సదానందం(రాజేంద్రప్రసాద్) కూతురు మానస (ప్రగ్యా నాగ్రా). సాఫ్ట్వేర్ జాబ్ వున్న అల్లుడు అయితే తన కూతురు సంతోషంగా వుంటుందనేది సదానందం నమ్మిక. చైతన్య (సాయి రోనక్) మంచి జీతం వున్న సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్. పైగా స్వయాన సదానందం చెల్లులు( రోహిణి) కొడుకు. సొంత మేనల్లుడే. చైతన్య, మానసల పెళ్లి ప్రపోజల్ కి ఇరు కుటుంబాలు అంగీకారం తెలుపుతాయి. పెళ్లి పనులు సందడిగా మొదలైపోతాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో చైతన్య ఉద్యోగం పోతుంది. తనకు ఎట్టి పరిస్థితిలో సాఫ్ట్వేర్ జాబ్ వున్న అల్లుడే కావాలని భీష్ముంచుకొని కూర్చుకున్న సదానందం, అల్లుడుకి జాబ్ లేదని తెలిసిన తర్వాత ఆ పెళ్లి తప్పించడానికి ఏం చేశాడు? అసలు ఈ పెళ్లి చైతన్య, మానసలకి ఇష్టం ఉందా లేదా? సాఫ్ట్వేర్ పై సదానందంకు ఎందుకంత పొంగు? ఇవన్నీ తెరపై చూడాలి.
సినిమా కథ ఇలానే ఉండాలనే రూల్ లేదు. అయితే చెప్పిన కథ ఆసక్తి కలిగించేలా ఉండాలనేది ఆడియన్ కండీషన్. లగ్గం దర్శకుడు రమేష్ కూడా ఈ కథని కాస్త వైవిధ్యంగానే చెప్పాలని అనుకున్నాడు. తెలంగాణలో జరిగే పెళ్లిలోని ప్రతి ఘట్టాన్ని అందంగా చూపిస్తూ దాని చుట్టూనే కొన్ని పాత్రలు వాటి మధ్య సంఘర్షణని చిత్రీకరించాలని చూశాడు. పెళ్లి వరకూ ఈ ఆలోచన బావుంది. ఆ సన్నివేశాలు, పాటలు ఫీల్ గుడ్ గానే వచ్చాయి. అయితే పెళ్లి చుట్టూ తను రాసుకున్న సాఫ్ట్వేర్ సోషల్ కామెంటరీ, జాలి-ప్రేమ మధ్య వ్యత్యాసం లాంటి లేయర్లు ఇందులో అంతగా ఇమడలేదు. రాజేంద్రప్రసాద్ కు సాఫ్ట్వేర్ పై మోజు కలిగే ఆరంభ సన్నివేశాలు, పెళ్లి పనులు, ఇరు కుటుంబాల హడావిడి.. లైటర్ నోట్ లో సాగే కథనం ఇంటర్వెల్ వద్ద ఓ మలుపు తీసుకుంటుంది. ఈ మలుపు కూడా ఊహించినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత హీరో చెప్పే వెర్షన్ తో ఇంకో లేయర్ యాడ్ అవుతుంది.
ప్రేమ- జాలి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ వచ్చే సన్నివేశాలు మొదట్లో కాస్త నాన్ సింక్ అనిపించినా మేనత్త మేనకోడలు బంధాన్ని దర్శకుడు బలంగా రాశాడు. రోహిణీ నటన కావచ్చు, లేదా మణిశర్మ బీజీఎంలోని మ్యాజిక్ వర్క్ అవుట్ అవ్వడం కావొచ్చు.. ఒక చోట కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. తల్లి లేని పాప పై ప్రేమ చూపించినా అది జాలిగా అపార్ధం చేసుకునే క్యారెక్టర్, అక్కడ నుంచి వచ్చిన రియలైజేషన్ మనసుని కదిలించేలానే వుంటుంది. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ పూర్తయిన తర్వాత ఈ కథని హుక్ చేసే మరో పాయింట్ లేకుండా పోయింది. సాఫ్ట్వేర్ జాబులపై ఆకర్షణ నిత్యం సోషల్ మీడియాలో చూసే వ్యవహారమే. అలాగే విదేశాల్లో సెటిల్ అయిన పిల్లలు అత్యవసర పరిస్థితిలో కూడా పేరెంట్స్ వద్దకు రాలేకపోయే పరిస్థితులు కూడా మన చుట్టూ కనిపిస్తూనే వుంటాయి. వీటిని ఆధారంగా ఈ కథని ముగించడం రొటీన్ వ్యవహారంగా మారింది.
సాయి రోనక్ తన పాత్రలో సహజంగా కుదిరాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. మరీ హీరోయిజం వున్న క్యారెక్టర్ కాదిది. మామూలు కుర్రాడి పాత్రలోనే ఇమిడిపోయాడు. ప్రగ్యా నాగ్రా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ కు ఇలాంటి పాత్ర చేయడం కొత్త కాదు. అయితే ఆయనకి తెలంగాణ యాస అంత సహజంగా కుదరలేదు. ఆయనే కాదు ఇందులో చాలా మంది నటీనటులు తెలంగాణ యాస పలకడానికి ఇబ్బంది పడ్డారు. ఎమోషనల్ సీన్స్ చేయడంలో రోహిణి స్పెషలిస్ట్. ఇందులో మేనకోడలితో ఆమెకు వున్న బాండింగ్ టచ్చింగ్ గా వుంటుంది. నిజానికి అదే లేయర్ తో ఒక బలమైన కథ రాయొచ్చు. ఎల్బి శ్రీరామ్ ఎప్పటిలానే తన మార్క్ చూపించారు. డీజే క్యారెక్టర్ లో చమ్మక్ చంద్ర కాసేపు నవ్విస్తాడు. రచ్చ రవి, సప్తగిరి, రఘుబాబు, శ్రీకృష్ణుడు లాంటి మంచి టైమింగ్ వున్న నటులు వన్నప్పటికీ వారిని దర్శకుడు సరిగ్గా ఉపయోగించలేదేమో అనిపించింది.
మణిశర్మ నేపధ్య సంగీతం బావుంది. చాలా చోట్ల ఎమోషన్ హోల్డ్ చేయగలిగింది. చరణ్ అర్జున్ ఇచ్చిన పాటల్లో పెళ్లి పాట,అలాగే చివర్లో వచ్చే అప్పగింతల పాట వినడానికి, చూడటానికి బావున్నాయి. కెమెరాపనితనం, ఎడిటింగ్, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. ఎలాంటి అసభ్యత లేకుండా క్లీన్ గా సినిమా తీయడం మరో మెచ్చుకోదగ్గ విషయం. కాకపోతే చిన్న సినిమాలకి, స్టార్స్ లేని సినిమాలకి క్రౌడ్ ఫుల్లర్.. కంటెంటే. మరి ఈ కంటెంట్ తో జనాల్ని థియేటర్ల వరకూ రప్పిస్తారా, లేదా? అనేది చూడాలి.
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్-