బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆయన పిల్లలు ఒకరంటే ఒకరు పడని పరిస్థితికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇది మరింతగా ముదిరింది. లాలూ ప్రసాద్‌కు కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేసిన కుమార్తె రోహిణి ఆచార్య ఇక తన కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నానని ప్రకటించారు. తనను ఘోరంగా అవమానించారని .. చెప్పులతో దాడి చేయబోయారని ఆమె కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ ఎప్పుడో దూరమయ్యారు. అంటే ఇప్పుడు లాలూ కుటుంబం చీలిపోయింది.
బీహార్‌లో హాట్ టాపిక్ అవుతున్న లాలూ కుటుంబ వ్యవహారాలు
లాలూ ప్రసాద్ యాదవ్‌కు 9 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరు 2 మంది కుమారులు, ఏడుగురు కుమార్తెలు. మీసా భారతి, రోహిణి ఆచార్య, చందా సింగ్, రాగిని యాదవ్, హేమా యాదవ్, అనుష్క రావు, రాజ్‌లక్ష్మి సింగ్ యాదవ్ కుమార్తెలు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ కుమారులు. వీరిలో ప్రస్తుతం మీసా భారతి ఆర్జేడీ ఎంపీగా ఉన్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబం నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. తేజస్వి యాదవ్ ఆర్జేడీని నడుపుతున్నారు. రోహిణి ఆచార్య కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లుగా ప్రకటించారు. రాజకీయాల్లోకి ఆమెను ప్రోత్సహించకుండా అవమానిచడమే కారణం. మరో ముగ్గురు కుమార్తెలు కూడా లాలూ ఇంటితో సంబంధాలు తెంచుకున్నారు. ఈ కుటుంబ రాజకీయాలు బీహార్ లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఒక్క లాలూ కాదు.. రాజకీయానికి బలవుతున్న కుటుంబాలెన్నో !
భారత దేశంలో ప్రాంతీయ పార్టీలు తరచూ కుటుంబ రాజకీయాలపై ఆధారపడతాయి. కానీ అధికార పోరాటాలు, వారసత్వ వివాదాలు, వ్యూహాత్మక తేడాలు వల్ల చాలా కుటుంబాలు విడిపోయాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ లాక్కున్నారు.. యూపీలో సమాజ్ వాదీ పార్టీలో వ్యవహారాలు కూడా కుటుంబంలో చిచ్చు పెట్టాయి. 2016లో అఖిలేష్ తన మామ శివపాల్ని పార్టీ నుంచి తొలగించడం వల్ల పెద్ద వివాదంగా మారింది. చివరికి ములాయంకూడా డమ్మీగా మారారు. ఇక బీఆర్ఎస్ కుటుంబంలో జరుగుతున్న రాజకీయాలు మన కళ్ల ముందే ఉన్నాయి. కేటీఆర్, కవిత మధ్య సరిపడటం లేదు. కవితను పార్టీ నుంచి గెంటేశారు. ఇక వైసీపీలో షర్మిల, విజయమ్మతో జగన్ తో విభేదించి బయటకు వచ్చారు. తమిళనాడులో పీఎంకే తండ్రీ కొడుకులు రామదాస్, అంబుమణి విడిపోయారు. డీఎంకే లోనూ స్టాలిన్ కు ఆయన సోదరుడికి మధ్య చాలా రాజకీయాలు జరిగాయి. ఇప్పటికీ సర్దుబాటు జరగలేదు.
శత్రువులుగా మారుతున్న కుటుంబసభ్యులు
రాజకీయాలను రాజకీయాలుగా చూడలేకపోతున్నారు. ఆధిపత్య పోరాటంలో తాము వెనుకబడిపోతే..కుటుంబం నుంచి బయటకు వచ్చి శత్రువులుగా మారిపోతున్నారు. చివరికి ఆస్తి పంపకాల దగ్గర కూడా తేడాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తన సోదరికి ఆస్తి ఇవ్వాల్సిన వస్తుందని పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నారు. చివరికి బంధుత్వం కాస్తా శత్రుత్వంగా మారుతోంది. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా ఇలా జరుగుతోంది. పార్టీలో ఒకరికి మించి వారసులు ఉన్నప్పుడు వారి మధ్య ఎప్పుడైనా వివక్ష ఆలోచనలు వస్తే.. ఇక ఆపడం ఎవరి తరం కావడం లేదు. కుటుంబాలు చీలిపోతున్నాయి. ఫలితంగా ఆయా పార్టీలు కూడా బలహీనపడుతున్నాయి.
రాజకీయం అత్యంత రాక్షసమైనది. దాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలి లేకపోతే కుటుంబాలను సైతం చీల్చేస్తుంది. దానికి ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందు ఉన్నాయి.
