విజయవాడలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మాణానికి లూలు గ్రూపునకు కేటాయించిన భూముల వ్యవహారం మరోసారి మలుపు తిరిగింది. ఈ కేటాయింపులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.
విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కి చెందిన సుమారు 4.15 ఎకరాల అత్యంత విలువైన భూమిని లూలు గ్రూపునకు లీజుకు కేటాయించారు. ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, న్యాయవాది వెంకటేశ్వరరావు వంటి వారు కోర్టులో సవాలు చేశారు. మార్కెట్ ధర కంటే తక్కువకు భూమిని కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. లూలూ కూడా ఈ మాల్ ఏర్పాటు విషయంలో అంత ఆసక్తిగా లేకపోవడంతో భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
లూలూ సంస్థ అంతర్జాతీయంగా మాల్స్ నిర్మాణం, నిర్వహణలో గుర్తింపు పొందింది. అయితే ఏపీలో మాత్రం ఆ సంస్థ పెట్టుబడులు పెట్టాలనుకున్నా సజావుగా సాగడం లేదు. గతంలో విశాఖలో మాల్ కట్టాల్సిన సమయంలో జగన్ భూ కేటాయింపులు రద్దు చేశారు. అప్పట్లో తాము అసలు ఏపీలో ఇక పెట్టుబడులు పెట్టబోమన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక వారిని ఒప్పించారు. కానీ వారు అంత చురుగ్గా పెట్టుబడులు గ్రౌండింగ్ చేయడం లేదు.
