మాజీ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ సర్కార్ మ్యూజిక్ స్టార్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఆయనపై భూకబ్జా కేసులు నమోదయ్యాయి. రూ. 250 కోట్ల విలువైన గిరిజనుల పొలాలను.. రూ. ముూడు లక్షలు ఇచ్చి రాయించుకున్నారని గిరిజనులు కేసులు పెట్టారు. వెంటనే షామీర్ పేట పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన బినామీలుగా గుర్తించి తొమ్మిది మందిపై కేసులు పెట్టారు. ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. మల్లారెడ్డిపై అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి.
ఆయన ఎంపీగా, మంత్రిగా ఉన్నప్పుడు.. మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా కనిపించిన ఏ భూమినీ వదల్లేదని చెబుతున్నారు. ఆ వివాదాలపై బయటకు తీసుకు రాలేదు కానీ. ..కొత్త కేసు నమోదయింది. పాత కేసులు ఎప్పుడైనా బయటకు తీసుకు వస్తారని మల్లారెడ్డి భయపడుతున్నారేమో కానీ ఇలా కొత్త కేసులు చుట్టుముడతాయని ఊహించి ఉండరు. మల్లారెడ్డి.. గతంలో రేవంత్ రెడ్డిపై దూకుడుగా ఉండేవారు. బ్లాక్ మెయిలర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డే సీఎం కావడంతో ఆయన పరిస్థితి దారుణంగా ఉంటుందని కొంత కాలంగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వీలైనంత సైలెంట్ గా ఉంటున్నారు.
మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిద్దరూ నోరు తెరవలేకపోతున్నారు. రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి తట్టుకోవడం కష్టమని.. ఆయన పార్టీ మారిపోవడం మంచిదని.. సలహాలు కూడా వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.