బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జాగృతి పేరుతో రాజకీయం కాని రాజకీయం చేస్తున్న కవిత నాలుగు నెలల పాటు జనంలో ఉండేందుకు జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో ఆమెపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కవిత, ఆమె భర్త వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని డాక్యుమెంట్లతో సహా కొంత మంది ఎంపీ ఈటల రాజేందర్ కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐడీపీఎల్ భూమి 20 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు
కూకట్ పల్లి ఎమ్మార్వో కార్యాలయ పరిధిలోని బాలానగర్ సమీపంలో IDPL కు చెందిన సర్వే నంబర్ 2010/4 భూమి లో కవిత భర్త అనిల్ , ఏవీ రెడ్డి అనే వ్యక్తులు కలిసి ఈ కబ్జా చేశారని ఈటలకు అందిన ఫిర్యాదులో ఉంది. ఈ ఏవీ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడని కూడా వారు ఆరోపించారు. ఓవర్ లాప్ భూ సర్వే నంబర్ల ఆధారంగా చేసుకొని తతంగం నడిపించారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ భూమి విలువ రెండు వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
కవిత భర్త పేరుపైనే భూమి – ఇప్పుడు రియల్ ప్రాజెక్టులు
కవిత భర్త అనిల్ పేరు మీదనే ఆ భూమి ఉంది. ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని , ఫ్లాట్స్ కట్టి అమ్మకాలు మొదలు పెట్టారని ..అసలు కవిత భర్త అనిల్ కు ఇక్కడ భూమి ఎలా వచ్చింది అన్నదానికి సమాధానం లేదని వారంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక భూబదిలీ జరిగిందని , దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్ , ఏవీ రెడ్డి ప్రత్యక్షంగా ఉన్నారని వారు చెబుతున్నారు. 20 ఎకరాల భూమిని కాపాడాలని , ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల , హాస్పిటల్ వంటి ప్రజోపయోగ నిర్మాణాలు జరిగేలా చూడాలని ఈటలను కోరారు. తాము అనేకసార్లు హైడ్రా కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వారు చెబుతున్నారు.
ఈటలే బయట పెట్టించారా ?
ఈ ఆరోపణలు చిన్నవి కాదు. తెర వెనుక ఎవరూ లేకుండా.. వచ్చి ఫిర్యాదు చేయరు. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వ్యవహారం కాబట్టి.. సమాచారం ఉండటంతోనే ఈటల రాజేందర్ తన అనుచరులతో తనకే వినతి పత్రం ఇప్పించుకునేలా చేశారని భావిస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లడానికే ఆయనీ వ్యూహం పాటించి ఉంటారు. ఈ అంశంపై ముందు ముందు మరింత రాజకీయం జరిగే అవకాశం ఉంది.
