ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త శిఖరాలను తాకుతోంది. ముఖ్యంగా విశాఖ – భీమిలి తీర ప్రాంత కారిడార్‌లో భూముల ధరలు కళ్లు చెదిరే రీతిలో పెరుగుతున్నాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ భారీ ఏఐహబ్లు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో, పెట్టుబడిదారులు ఈ ప్రాంతంపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే ఈ ప్రాంతంలో భూముల విలువ దాదాపు 75 శాతం మేర పెరిగింది.
గతంలో ఎకరం రూ. 3 కోట్ల వరకు పలికిన భూముల ధరలు, ఇప్పుడు డిమాండ్‌ను బట్టి రూ. 5 కోట్ల నుండి రూ. 6 కోట్ల వరకు చేరుకున్నాయి. డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమైన వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తుండటం, దానికి తోడు అనుబంధ ఐటీ సంస్థలు కూడా ఇక్కడికే వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ధరల పెరుగుదలకు అడ్డులేకుండా పోతోంది. రాబోయే రోజుల్లో ఐటీ హబ్‌గా భీమిలి అవతరిస్తుందన్న అంచనాలతో స్థానిక రియల్టర్లు తమ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నారు.
మరోవైపు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తూండటం ప్రాంతానికి వరంగా మారింది. భీమిలి నుండి భోగాపురం వరకు ఉన్న కోస్టల్ రోడ్డు అభివృద్ధి, ప్రతిపాదిత మెట్రో కారిడార్ వంటి మౌలిక వసతుల కల్పన వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇక్కడ ప్లాట్లు కొనడం అందని ద్రాక్షగా మారుతోంది. కేవలం వాణిజ్య అవసరాలకే కాకుండా, లగ్జరీ విల్లా ప్రాజెక్టులు , బీచ్ రిసార్ట్‌ల కోసం కూడా పెద్ద ఎత్తున విచారణలు వస్తుండటంతో విశాఖ తీర ప్రాంతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ బంగారు గనిగా మారిపోయింది.
