వారసత్వ ఆస్తులను తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వంగా వచ్చిన భూముల సక్సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి, భూమి వివాదాలను తగ్గించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్రామ, ఆస్తి విలువ రూ. 10 లక్షల లోపు ఉంటే స్టాంపు డ్యూటీగా రూ. 100 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించారు. ఆస్తి విలువ రూ. 10 లక్షలకు పైన ఉంటే స్టాంపు డ్యూటీగా రూ. 1,000 వసూలు చస్తారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తారు.
ఆస్తి యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. వారసులు ఆస్తిపై లిఖిత ఒప్పందానికి వస్తే, డిజిటల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత, మ్యుటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. వారసత్వ ఆస్తులు తప్ప, ఇతర ఆస్తి లావాదేవీలు కొనుగోలు, అమ్మకం, గిఫ్ట్ డీడ్ మొదలైనవి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలోనే జరుగుతాయి.
రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే భూమి వివాదాలను తగ్గించడం, తహసీల్దార్ కార్యాలయాల్లో జాప్యం మరియు అవినీతిని నివారించడం…ఇలాంటి పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించారు.