కేసీఆర్, చంద్రబాబు నాయుడు స్టయిలే వేరు

అధికారంలో వచ్చిన వారికి కొన్ని ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలు ఉండటం సహజం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి టెక్నాలజీ, పరిశ్రమలు, వ్యాపారంపై ఎక్కువ ఆసక్తి కనబరిస్తే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం, సాగునీరు, త్రాగునీరు తదితర పధకాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈవిధంగా చూసుకొంటూపోతే ఇద్దరిలో చాలా భిన్నత్వం కనిపిస్తుంది. ఇద్దరికీ ఎవరి ప్రాధాన్యతలు వారికున్నాయి. ఎవరి దారిలో వారు సాగిపోతున్నారు.

చంద్రబాబు నాయుడు తన ప్రాధాన్యతలనే తప్ప ఇతర విషయాల మీద పెద్దగా శ్రద్ధపెట్టరు. ఉదాహరణకి గోదావరి పుష్కరాల పని పట్టుకోగానే పూర్తిగా దానికే అంకితమయిపోయారు. ఆ సమయంలో రాష్ట్రంలో మరేమయినా పనులు జరుగుతున్నాయా లేదా? అన్నట్లు ఉండేది ఆయన వ్యవహారం. ఆయన తప్ప మరెవరికీ పుష్కరాలలో ఇంపార్టెన్స్ కనబడేది కాదు. ఆ కారణంగా మిగిలిన మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఆయన ఏమి చెపితే అది చేస్తే చాలు అన్నట్లుగా ప్రవర్తించవలసివచ్చింది. హూద్ హుద్, రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ సంస్థలతో చర్చలు, భూసేకరణ, పట్టిసీమ, అమరావతి శంఖుస్థాపన…ఇలాగ అనేక ఉదాహరణలు చూడవచ్చును. ఆ కారణంగా ఆయన స్వయంగా శ్రమించవలసి రావడమే కాకుండా ఊహించని ఇబ్బందులు, విమర్శలు కూడా ఎదుర్కోవడం చూసాము.

అదే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తను చాలా ప్రాధాన్యామిచ్చే పనులలో కూడా ఎక్కువగా కలుగజేసుకోకుండా సంబంధిత మంత్రులు, అధికారులకే బాధ్యతలు అప్పగించి పైనుండి పర్యవేక్షిస్తుంటారు. తెలంగాణాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులు, వరుసగా వస్తున్న ఎన్నికలలో ఆయన తీరును గమనించినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది.

ఇరువురు ముఖ్యమంత్రులు కూడా తమ తమ ప్రాధాన్యతలను బట్టే పనులు చేయిస్తున్నప్పటికీ, చంద్రబాబు నాయుడు స్వయంగా పూనుకోవడం వలన ఎక్కడయినా తప్పులు జరిగినా, ఊహించని సమస్యలు ఎదురయినా అడ్డంగా దొరికిపోతుంటారు. అదే కేసీఆర్ తన చేతిలో ఉన్న యంత్రాగాన్ని సమర్ధంగా వాడుకొంటూ పనులు కానిచ్చేస్తుంటారు కనుక ఎక్కడయినా తప్పులు జరిగినా, ఊహించని సమస్యలు వచ్చినా ఆయన నేరుగా అందులో చిక్కుకోరు. ఆ సమస్యలకు ఆయనను ఎవరూ బాధ్యులు చేయలేరు. ఆయనను ప్రభుత్వంలో ఉన్న యంత్రాగాన్ని ఉపయోగించుకొంటారు కనుక ఆ యంత్రాంగమే ఆయనను కాపాడుతుంటుంది.

ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధంగా వినియోగించుకొనే వారు. చివరికి అవినీతిలో కూడా క్రింద నుండి పైదాకా అందరినీ కలుపుకొని పోయేవారు. అందుకే ఆయనకి అందరూ చాలా చక్కగా సహకరించారు. ఆయన అందరి మన్ననలు పొందారు. జీవించి ఉన్నంత కాలం ఆయన చేసిన తప్పులను ఎవరూ కనిపెట్టలేకపోయారు కానీ ఆయన మరణించగానే ఆయనకు సహకరించిన ఉన్నతాధికారులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, చివరికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో చాలా మంది జైలుకి వెళ్ళవలసి వచ్చింది. ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో చాలా వరకు అసంపూర్ణంగా మిగిలిపోయినా, అవినీతి మేటలు వేసినా ఆయన బ్రతికి ఉన్నంత కాలం ఒక వెలుగు వెలిగి అందరి మన్ననలు పొందగలిగారు. అది ఎలాగ సాధ్యమయిందంటే ఆయన ప్రభుత్వ యంత్రాగాన్ని పూర్తిగా వాడుకొన్నారు. అదే ఆయనకు చివరిదాకా కవచంలా కాపాడిందని చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com