ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విశ్వరూపం చూపిస్తూండటంతో ఐటీ రంగంలో అనిశ్చితి ప్రారంభమయింది. దిగ్గజాలు కూడా ఉద్యోగుల్ని భారీగా తొలగిస్తున్నాయి. ఏఐ రంగంలో నియామకాలు చేపడుతున్నాయి. లే ఆఫ్స్ చేయకుండా ఆపలేకపోతున్నామని సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల లాంటి వారు ఆవేదన చెందుతున్నారు. ఆ ప్రక్రియ ఇప్పుడు ఇండియాకూ పాకినట్లుగా కనిపిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మ్యాన్ పవర్లో రెండు శాతాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఇండియా ఐటీ రంగంలోనూ లే ఆఫ్స్ భయం ప్రారంభమయింది.
బడా సంస్థలు వరుసగా లేఆఫ్స్ ప్రకటించే అవకాశం
టీసీఎస్ లో ఆరు లక్షలకు మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో పన్నెండు వేల మందికి లేఆఫ్స్ ప్రకటించనుంది. ఇందకు ముందే టీసీఎస్ ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అత్యధిక కాలం బెంచ్ పై ఉండే ఉద్యోగుల్ని పంపించేయాలని డిసైడ్ అయింది. బెంచ్ పై ఉండేవాళ్లు.. తమ స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. దాని ప్రకారం అప్ డేట్ చేసుకుని ఏదో ఓ ప్రాజెక్టులో చేరిపోతే ఉద్యోగం ఉంటుంది. లేదంటే పోతుంది. ఇలా వారిని ఉద్యోగాల్లో ఉంచడానికి, ఉండటానికి అన్ని అవకాశాలు కల్పించిన తర్వాతనే లేఆఫ్స్ ప్రకటిస్తున్నారు కానీ.. వర్క్ లో ఉండగా.. మెయిల్స్ పంపడం లేదు.
బెంచ్ పై ఉండే వారే టార్గెట్ – స్కిల్స్ పెంచుకుంటే సమస్య లేనట్లే
ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఐటీ కంపెనీలు.. బెంచ్ స్ట్రెంత్ నూ ఉంచుకుంటాయి. ఒకప్పుడు మ్యాన్ పవర్ అందుబాటు తక్కువగా ఉండేది. ఇప్పుడు ఓవర్ ఫ్లో అవుతోంది. పైగా ఆటోమేషన్ , AI సాంకేతికతలు రొటీన్ టాస్క్‌ల అవసరాన్ని తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా మాన్యువల్ టెస్టింగ్ వంటి రోల్స్‌లో అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇతర సంస్థలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్, విప్రో వంటి ఇతర ఐటీ సంస్థలు లాభదాయకతను కాపాడుకోవడానికి , క్లయింట్ డిమాండ్లకు అనుగుణంగా ఉండటానికి ఇలాంటి లేఆఫ్స్‌ను అనుసరించవచ్చని అంచనా.
రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కీలకం !
AI, సైబర్‌సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతికతలలో స్కిల్ గ్యాప్ కారణంగా ఈ లేఆఫ్స్ జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు సీనియర్ ఉద్యోగులు, ముఖ్యంగా మిడిల్ మేనేజ్మెంట్లో ఉన్నవారు, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా రీస్కిల్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. AI , ఆటోమేషన్ ఐటీ రంగాన్ని రీషేప్ చేస్తున్నాయి. ఇది రీస్కిల్లింగ్ , అప్‌స్కిల్లింగ్ అవసరాన్ని బలంగా చెబుతోంది. సంస్థలు హై-వాల్యూ సర్వీసెస్ , అధునాతన సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ దిశగా ఉద్యోగులు దృష్టి పెట్టాల్సిందే.