రియల్ ఎస్టేట్ రంగానికి ఊపునిచ్చేలా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా అనధికార లే-అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో మాత్రం వర్తించదు. ఇతర పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అనధికార లే-అవుట్లకు ఈ పథకం వర్తిస్తుంది. 2025 జూన్ 30కి ముందు వేసిన లే-అవుట్లు ఈ పథకం కింద క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చు. – రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,000 ఎకరాల్లో వేసిన అనధికార లే-అవుట్లు క్రమబద్ధీకరణకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ పథకం కోసం ప్రత్యేక పోర్టల్ ఆగస్టు 1, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తుదారులు ఈ పోర్టల్ ద్వారా అనధికార లే-అవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్దేశించిన బేసిక్ ధరలనే ఇప్పుడు కూడా ఖరారు చేశారు. ఈ పథకం ద్వారా అనధికార లే-అవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా భూమి యాజమాన్య సమస్యలను పరిష్కరించడంతో పాటు, పట్టణాభివృద్ధిని ప్రోత్సహిస్తుందని. భావిస్తున్నారు.
అక్రమ లేఔట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మేసుకుంటారు. కానీ వాటిని కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటిని క్రమబద్ధీకరిస్తే చాలా వరకూ సమస్యలు పరిష్కారం అవుతాయి. లావాదేవీలు పెరుగుతాయి.