ప్రభుత్వాలు లిక్కర్ దుకాణాలను దక్కించుకోవాలని ఆశపడేవారి నుంచి డబ్బులు పిండేస్తున్నాయి. అదే సమయంలో కాస్త డబ్బులు పోతే పోయాయి దుకాణాలు కావాలనుకునే వ్యాపారుల్ని కూడా వీలైనంతగా పిండుకుంటున్నాయి. నాన్ రిఫండబుల్ ధరఖాస్తు ఫీజు ను లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ఓ రకంగా ఇది లాటరీ టిక్కెట్ లాంటిదే. లక్షలు పెట్టి ఓ దరఖాస్తు చేస్తే లాటరీ వేస్తారు. ఆ లాటరీ తగిలితే దుకాణం వస్తుంది. లేకపోతే ఆ దరఖాస్తు డబ్బులు ప్రభుత్వం ఖాతాలో పడిపోయినట్లే.
వచ్చే డిసెంబర్ నుంచి తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్లు ఇస్తారు. ఇందు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సారి దరఖాస్తు ఫీజును రూ. మూడు లక్షలకు పెంచింది. గతంలో ఇది రెండు లక్షలే ఉండేది. ఈ ఏడాది లక్షకు పెంచారు. గతంలోకేసీఆర్ ఎన్నికలకు వెళ్లే ముందే మద్యం దుకాణాలు వేలం వేయించారు. అప్పట్లో ప్రభుత్వానికి రెండు వేల కోట్లకుపైగా అప్లికేషన్ల ఫీజు రూపంలోనే వచ్చాయి. ఈసారి రేటు పెంచినందుకు మూడు వేల కోట్ల వరకూ వస్తాయని అంచనా.
అంటే మొత్తం రెండున్నర వేల దుకాణాలకు.. మంచి ఏరియాల్లో పదిహేను ఇరవై మంది వరకూ పోటీ పడే అవకాశం ఉంది. ఇలా సగటున ఒక్కో దుకాణానికి పది దరఖాస్తులు వచ్చినా.. ముఫ్పై లక్షల రూపాయలు దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి వస్తాయి. ఇలా రెండున్నర వేల దుకాణాలకు వస్తాయి. ఇలా డబ్బులు కట్టి లైసెన్స్ లు లాటరీలో పొందని వారికి బూడిద మిగులుతుంది. లైసెన్సులు దక్కించుకున్న వారు.. ప్రాంతాన్ని బట్టి యాభై లక్షల నుంచి కోటి పది లక్షల వరకూ ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి.