వచ్చిన సినిమా, వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోతున్నప్పుడు.. థియేటర్లలో జనం కనిపించనప్పుడు ఓ అనుమానం, ఓ ప్రశ్న సినిమా రూపకర్తల మెదళ్లలో తచ్చాడుతూ ఉంటుంది. సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గిపోయిందా, ఓటీటీలు కబళించేశాయా, పెద్ద సినిమాలకూ, క్రేజీ సినిమాలకే టికెట్లు తెగుతాయా? అనే మీమాంశ ఎవ్వరినీ అడుగు కూడా ముందుకు వేయనివ్వదు.
‘మంచి సినిమా తీశాం.. మీరే చూడడం లేదు’ అని ఆ నిందని జనాలపై రుద్దేసిన వాళ్లెంతో మంది. ఓ దర్శకుడు అయితే… `మీకు మలయాళ సినిమాలే నచ్చుతాయి..` అని తెలుగు ప్రేక్షకుల్ని సైతం నిందించేశాడు. పైకి చెప్పినా, చెప్పకపోయినా ఫ్లాప్ సినిమా తీసినవాళ్లందరి కంప్లైంటూ ఇదే. కానీ ఆ అభిప్రాయాలన్నీ మార్చేసింది `లిటిల్ హార్ట్స్`.
ఇలాంటి సినిమా వస్తుందన్న సంగతి రిలీజ్కు నెల రోజుల ముందు వరకూ ఎవరికీ తెలీదు. ఇందులో స్టార్స్ లేరు. దర్శకుడెవరో తెలీదు. పైగా ఈటీవీ విన్ సినిమాబ ఇది. ఈటీవీ విన్ అంటే… నెల రోజులు తిరిగే లోపే, సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని అందరికీ తెలుసు. తాయితీగా ఇంటిపట్టునే ఉండి, రూపాయి ఖర్చు లేకుండా సినిమా చూసేయొచ్చు.
కానీ అదేం చిత్రమో.. లిటిల్ హార్ట్స్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ వీకెండ్ ఈ చిన్న సినిమాదే రాజ్యం. ఓవైపు ఘాటీ, మరోవైపు మదరాసీ లాంటి పెద్ద సినిమాలకు ప్రేక్షకులు కరువైన చోట.. లిటిల్ హార్ట్స్ అందరి హృదయాల్నీ గెలచుకొంది. రూపాయి పెట్టుబడి పెడితే.. మూడు రూపాయలు లాభం తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్లే. షో.. షోకీ థియేటర్లు పెరుగుతున్నాయి. ‘సినిమా అంటే ఇలా ఉండాలి’ అంటూ ప్రేక్షకులు సైతం కితాబు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే చర్చ.
చిన్న సినిమాలకు వసూళ్లు లేవు అనే వాళ్లు ఇప్పుడు ఏం చెబుతారు? స్టార్స్ ఉంటేనే గానీ సినిమాలు చూడరు అనే వాళ్లు ఇప్పుడు ఎలా స్పందిస్తారు? మలయాళ సినిమాలకే ఇక్కడ క్రేజ్ అనేవాళ్ల దగ్గర సమాధానం ఉందా? ఓటీటీల వల్లే జనాలు రావడం లేదన్నవాళ్లు ఆ మాట మీద ఇప్పుడు నిలబడలగరా?
ఏం మారింది? అదే జనాలు. అదే థియేటర్లు. అదే సినిమా. విషయం ఉంటే స్టార్లతో పని లేదు, ఓటీటీలు ఏం చేయలేవు అని చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి వరల్డ్ బిల్డింగులు పెద్ద పెద్ద కథలు అవసరం లేదు. మనవైన, మనదైన కథలు చాలు అని చెప్పడానికి ఇదో సాక్ష్యం. నిర్మాతలు కూడా ప్రమోషన్లు భారీగానో, కొత్తగానో చెయ్యలేదు. వాళ్ల దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. యూత్ కి కావల్సిన కథ, దానికి సరిపడా ఆర్టిస్టుల్ని పట్టుకొన్నారు. తక్కువ బడ్జెట్ లో సినిమా తీశారు. ఓటీటీ అండ ఉంది. కాబట్టి విడుదలకు ముందే సేఫ్. మౌళికి ఉన్న సోషల్ మీడియా ఇమేజ్, పాపులారిటీ ఈ సినిమాకు ఉపయోగపడింది. ప్రీమియర్లు .. అందులోంచి వచ్చిన టాక్ వల్ల ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ స్పైడ్ అయి వసూళ్ల వర్షం కురుస్తోంది.
ఈ వరల్డ్ బిల్డింగులు, భారీ సెటప్పులు, పాన్ ఇండియా గోలలు వదిలి.. దర్శకులు, కథకులు కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. చిన్న చిన్న ఎమోషన్స్, సరదా పాత్రలు, నవ్వించే సన్నివేశాలు.. వీటిపై దృష్టి పెట్టి క్యూట్ కథల్ని చెప్పొచ్చు, అలా చెబితే చూస్తారు అని చెప్పడానికి లిటిల్ హార్ట్స్ ఓ ఉదాహరణ. దర్శకులు మేల్కోండి. సహజత్వానికి పెద్ద పీట వేయండి. అప్పుడే ప్రేక్షకులు కనికరిస్తారు. సినిమా బతుకుతుంది.