సైనిక్ పురిలో చదువు రాని హీరో
వాయుపూర్ లో అత్తెసరు మార్కులతో కుస్తీ పడుతున్న హీరోయిన్..
వీళ్లిద్దరూ చదువు మానేసి ప్రేమించుకొంటే ఎలా ఉంటుంది?
అదే ‘లిటిల్ హార్ట్స్’ కథ.
టీనేజ్ లవ్ స్టోరీలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. ఇప్పుడు మరీ ట్రెండీ అయిపోయింది గానీ, జియో సిమ్ రాక ముందు.. ఈ లవ్ స్టోరీలు ఇంకాస్త స్వచ్ఛంగా ఉండేవి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథని ‘లిటిల్ హార్ట్స్`లో చూపించబోతున్నారు. ’90’ ఫేమ్ మౌళి, శివానీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. సెప్టెంబరు 5న విడుదల చేస్తున్నారు. ఈ రోజు ట్రైలర్ బయటకు వచ్చింది.
ట్రైలర్ మొత్తం ఫన్ రైడ్ గానే సాగింది. మధ్యతరగతి జీవితాలు, అందులోని అల్లరి ప్రేమకథ, అందులోంచి వచ్చిన ఘర్షణ.. ఇదే సినిమా. అయితే.. ఫన్‌కి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా మౌళి నుంచి వచ్చిన చాలా డైలాగులు ఆకట్టుకొంటాయి. తన కామెడీ టైమింగ్ మరోసారి నవ్వులు పంచుతుంది. సోషల్ మీడియాలో తనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లను తను థియేటర్లకు రప్పిస్తే ఓపెనింగ్స్ బాగుంటాయి. రాజీవ్ కనకాల ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో దర్శనమిచ్చారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఆదిత్యహాసన్ నిర్మాత. ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఓటీటీకే పరిమితం చేయకుండా.. థియేటర్లలోనూ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది.