ఇప్పుడు అంతా గేటెడ్ కమ్యూనిటీల హవా నడుస్తోంది. ప్రత్యేకంగా గోడ కట్టేసుకుని అందులో అపార్టుమెంట్ కాంప్లెక్స్ లేదా విల్లాలు నిర్మించుకుని అందులో కుటుంబాలు నివసిస్తున్నాయి. బయట వారు కాలనీల్లోకి ఎవరూ రాలేరు. సెక్యూరిటీ ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. అన్నీ ప్లస్ పాయింట్లలా కనిపిస్తున్నాయి. నిజానికి ఆ ఇళ్లల్లోకి వెళ్లి ఆ లైఫ్ అనుభవించడం ప్రారంభించిన తర్వాతనే అసలు తాము ఇంట్లో ఉంటున్నామా.. హౌస్ అరెస్టులో ఉంటున్నామా అన్న అనుమానం వస్తుందన్న అభిప్రాయం మెల్లగా పెరుగుతోంది.
గేటెడ్ కమ్యూనిటీల్లోకి సొంత బంధువులు కూడా స్వేచ్చగా రాలేరు. అంత ఎందుకు.. వాహనం స్టిక్కర్లు మిస్ అయితే తాము కూడా లోపలికి వెళ్లలేరు. యాప్ పని చేయకపోతే.. తమ ఫోన్ పోతే.. ఇంట్లోకి వెళ్లాలంటే కిందా మీదా పడాలి. మన ఇంట్లోకి మనం యాక్సెస్ పొందాలంటే.. అనేక సెక్యూరిటీ చెకప్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడైనా .. అర్థరాత్రో.. అపరాత్రో బయటకు పోవాలన్నా.. బయటకు రావాలన్నా.. పలువురికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇరుగుపొరుగువారితో ఉండే సమస్యల గురించి చెప్పాల్సిన పని లేదు. అపార్టుమెంట్లు అయినా.. విల్లాలు అయినా ఈ సమస్యలు ఉంటాయి.
అదే ఓపెన్ కాలనీల్లో అయితే.. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అయితే అక్కడ సెక్యూరిటీ ఉండదు..ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందని చెబుతారు. కానీ దేశంలో 99శాతం ఇళ్లు ఇప్పుడు ఓపెన్ కాలనీల్లోనే ఉంటున్నాయి. వాళ్లకు లేని అభద్రత ఈ ఒక్క శాతానికి ఎలా వస్తుంది ?. దేశంలో జరుగుతున్న నేతాల్లో 90 శాతానికిపైగా పరిచయస్తులు.. నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయి. సెక్యూరిటీని ఓపెన్ కాలనీల్లోనూ భద్రంగానే మెయిన్‌టెయిన్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్టెన్స్ అనేది ఉండదు. కానీ.. చాలా ఖర్చు పెట్టుకుని జైల్లో ఉన్నట్లుగా గడపడానికి … ప్రతి సారి మనమెవరమో చెప్పుకుని మన ఇంట్లోకి వెళ్లేలా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరాన్ని గేటెడ్ కమ్యూనిటీలు కల్పిస్తాయి.
గేటెడ్ కమ్యూనిటీలు.. ప్రజల్ని సమాజంతో వేరు చేస్తాయి. అలాంటి ఇళ్లల్లో నివసించడం అంటే సమాజానికి దూరంగా ఉండటమేనన్న అభిప్రాయం పెరుగుతోంది. అందుకే రాబోయే రోజుల్లో ఈ గేటెడ్ కమ్యూనిటీలకు ఆదరణ తగ్గే అవకాశాలు ఉంటాయని సామాజిక నిపుణులు అంచనా వేస్తున్నారు.