నిన్న అద్వానీ నేడు మ‌నోహ‌ర్ జోషీ… అవ‌మాన‌క‌ర నిష్క్ర‌మ‌ణ‌

రాజ‌కీయాల్లో పార్టీల్లో నాయ‌కుల మార్పు కాలానుగుణంగా అవ‌స‌రం. అయితే, కొన్ని ద‌శాబ్దాల‌పాటు పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇచ్చి, కాల‌ప‌రీక్ష‌లు త‌ట్టుకుని, పార్టీ మ‌నుగ‌డ సాగించ‌గ‌లిగే నాయ‌క‌త్వాన్ని ఇచ్చిన‌వారికి త‌గిన గౌర‌వం ద‌క్కాలి. వారిని విధుల నుంచి త‌ప్పించ‌డం అనే కంటే… వారికి విశ్రాంతి ఇవ్వ‌డం అనే ర‌కంగా సీనియ‌ర్ల నుంచి బాధ్య‌త‌ల్ని త‌రువాతి త‌రానికి బ‌ద‌లాయించాలి. ఇదంతా ఎంతో హుందాగా, గౌర‌వంగా జ‌రగాల్సిన ప్రక్రియ‌. కానీ, భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉద్దండులైన నాయ‌కుల్ని అత్యంత అసంతృప్తిక‌ర‌మైన ధోర‌ణిలో ప‌క్క‌న‌పెడుతున్నారు. పార్టీ ప‌గ్గాలు అమిత్ షాకి వ‌చ్చాక సీనియ‌ర్ల‌ను వ‌రుస‌గా త‌ప్పిస్తూ వ‌స్తున్నారు. మొన్న‌టికి మొన్న‌, గాంధీ న‌గ‌ర్ నుంచి తానే పోటీ చేస్తున్నా అంటూ అమిత్ షా ప్ర‌క‌టించారు. సీనియ‌ర్ నేత అద్వానీ పోటీకి సుముఖంగా లేరు, ఆయ‌న ఆరోగ్య‌మూ స‌హ‌క‌రించ‌దన్న‌ది వాస్త‌వ‌మే. కాక‌పోతే… త‌న స్థానంలో అమిత్ షా పోటీ చేస్తార‌ని అద్వానీ నోట చెప్పించి ఉంటే ఎంత హుందాగా ఉండేది?

ఇప్పుడు, మ‌రో సీరియ‌న్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషిని కూడా ఇలానే అసంతృప్తికి గురిచేసి మ‌రీ ప‌క్క‌నపెడుతోంది భాజ‌పా జాతీయ నాయ‌క‌త్వం. కేంద్ర‌మంత్రిగా, భాజ‌పాలో కీల‌క ప‌ద‌వులు స్వీక‌రించి పార్టీని న‌డిపించిన నాయ‌కుడిగా పేరున్న మ‌నోహ‌ర్ జోషికి ఈసారి ఎంపీ టిక్కెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. ఈసారి కూడా ఆయ‌న కాన్పూర్ నుంచి పోటీ చేద్దామ‌ని భావించినా, అభ్య‌ర్థుల జాబితాలో ఆయ‌న పేరు లేదు. నిజానికి, ఆయ‌న‌కి టిక్కెట్ ఈసారి ఇవ్వ‌డం లేద‌నే విష‌యాన్ని కాస్త ముందుగా, స్వయంగా ఆయ‌న‌కి చెప్పి ఉన్నా కొంత‌గా హుందా ఉండేదేమో, సీనియ‌ర్ నేత‌కు కొంత గౌర‌వం ఇచ్చిన‌ట్టుగా ప్రొజెక్ట్ అయ్యేదేమో అనేది భాజ‌పా అభిమానుల ఆవేద‌న‌.

ఈ సంద‌ర్భంలో కాన్పూరు ఓట‌ర్ల‌కు ఆయ‌నో లేఖ రాశారు. ప్రియ‌మైన కాన్పూర్ ప్ర‌జ‌ల‌కు… రాబోయే ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచీ పోటే చేయ‌డానికి వీల్లేద‌ని భాజ‌పా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ లాల్ న‌న్ను కోరారని జోషీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ను పోటీకి దూరంగా ఉంచాల‌ని పార్టీ భావించింద‌ని బ‌హిరంగానే విమ‌ర్శ‌లు చేశారు. సీనియ‌ర్లకు గౌర‌వ‌ప్ర‌దంగా విశ్రాంతిని ఇవ్వాల్సింది పోయి, ఇలా ప‌క్క‌న‌పెట్ట‌డంపై సంప్ర‌దాయ భాజ‌పా అభిమానులు ఆగ్ర‌హానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. నిజానికి, ఇది మంచి సంప్ర‌దాయం కూడా కాదు. రేప్పొద్దు ఇదే అమిత్ షా, మోడీ కూడా ఏదో ఒక‌రోజు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల్సిందే క‌దా. అది ఆలోచించ‌క‌పోతే ఎలా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com