లోక్‌సభ ఎంపీపై వేసిన అనర్హతా వేటుపై లోక్‌సభ సెక్రటేరియట్ వెనక్కి తగ్గింది. అనర్హతా వేటును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇది రాహుల్ గాందీపై కాదు.ఇంతకు ముందే లక్షద్వీప్ ఎంపీపై ఇలాగే అనర్హతా వేటు వేశారు. ఎన్సీపీ తరపున లక్షద్వీప్ నుంచి ఎంపీ గా గెలిచిన మహ్మద్ ఫైజల్ ఓ కేసులో శిక్షకు గురయ్యారు. 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది.
ఈ కేసుపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ లోక్‌సభ సెక్రటేరియట్ ఆ పని చేయ లేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
అంటే రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు విధించిన శిక్షపై పై కోర్టుస్టే విధిస్తే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరిస్తారన్నమాట. అయితే ఇలా ప్రజల చేత ఎన్నికలైన సభ్యుడి సభ్యత్వాన్ని ఇలా రద్దు చేయడం.. మళ్లీ పునరుద్ధరించడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఓ సారి రద్దు చేస్తే మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశం ఉండదని.. ఎన్నిక జరపాల్సిందేనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా .. చట్టాలు ఎంత లోపభూయిష్టంగా చేస్తారో … తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది.