ఏపీ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గమైన మంగళగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్నారు. తాజాగా, తాడేపల్లి పరిధిలో రూ. 294.20 కోట్లతో కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో వచ్చిన భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని, ఏకంగా 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టమైన డిజైన్తో ఈ గోడను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లోతట్టు ప్రాంతాల్లో దశాబ్దాలుగా వరద భయంతో గడుపుతున్న సుమారు 50 వేల మంది ప్రజలకు శాశ్వత విముక్తి లభించనుంది.
కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా సమస్యే
కృష్ణా నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ మంగళగిరి నియోజకవర్గంలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. గతేడాది 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు పడిన కష్టాలను చూసి, భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా 1.7 కిలోమీటర్ల పొడవు, 9 మీటర్ల ఎత్తుతో ఈ రక్షణ గోడను రూపొందించారు. భూమి లోపల 38 మీటర్ల లోతు వరకు పైల్స్ వేసి, భూకంపాలను కూడా తట్టుకునేలా ఫైల్ రాప్ట్ సాంకేతికతను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం నివాసాలకే కాకుండా, జాతీయ రహదారి-65కు కూడా రక్షణగా నిలవనుంది.
మంగళగిరిలో ఎటు చూసినా లోకేష్ ముద్ర
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లోకేష్ కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, పేదల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్నారు. దశాబ్దాలుగా ఇళ్లు ఉండి పట్టాలు లేని 5,000 మందికి పైగా నివాసితులకు ఉచితంగా శాశ్వత గృహ పట్టాలు పంపిణీ చేశారు. స్వచ్ఛ మంగళగిరి పేరుతో పార్కులు, ప్లేగ్రౌండ్లు, శ్మశాన వాటికల ఆధునీకరణ వంటి 50కి పైగా అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రారంభించారు. అలాగే, నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లోకేష్ పనితీరు
మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి లోకేష్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామికంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తూ, యువతకు ఉపాధి కల్పించేలా ఐటీ కంపెనీల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులతో ఆయన మంగళగిరి రూపురేఖలను మారుస్తున్నారు. మాట ఇస్తే తప్పని నాయకుడిగా తన నియోజకవర్గ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ, తన మెజారిటీకి తగ్గట్టుగానే అభివృద్ధిలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
