ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ భారతదేశంలో తన అసెంబ్లీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదానీ గ్రూప్‌తో కలిసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎంబ్రాయర్ చర్చలు జరుపుతోంది.
గుజరాత్‌లోని ధోలేలా.. భోగాపురం ప్రాంతాల పరిశీలన
ఈ భారీ తయారీ యూనిట్ రేసులో గుజరాత్‌లోని ధోలేరాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ప్రధాన పోటీదారుగా ఉంది. భోగాపురం విమానాశ్రయాన్ని కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, ఒక భారీ ఏరోస్పేస్ , డిఫెన్స్ హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇటీవల మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టు కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. భూమి లభ్యత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పారిశ్రామిక ప్రోత్సాహకాలు భోగాపురానికి సానుకూల అంశాలుగా మారాయి. ఒకవేళ ఈ ప్లాంట్ ఇక్కడకు వస్తే, భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రయాణికుల విమానాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తుంది.
గట్టి ప్రయత్నాలు చేస్తున్న నారా లోకేష్
అదానీ గ్రూప్ ఇప్పటికే విమానాశ్రయాల నిర్వహణలో ఉండటం, ఎంబ్రాయర్ వంటి ప్రపంచ స్థాయి సంస్థతో జతకట్టడం భారత విమానయాన రంగంలో పెను మార్పులకు నాంది కానుంది. సాధారణంగా 70 నుంచి 146 సీట్ల సామర్థ్యం ఉన్న రీజినల్ జెట్ల తయారీపై ఈ సంస్థ దృష్టి సారిస్తోంది. దీనివల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, విమాన విడిభాగాల తయారీ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి తరలివస్తాయి. ఈ ప్రాజెక్టు భోగాపురానికి దక్కితే, ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భోగాపురంకు వస్తే ఉత్తరాంధ్ర రాత మారినట్లే !
ఈ డీల్ కుదుర్చుకోవడంలో లక్ కూడా కలిసి రావాల్సి ఉంది. గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, భోగాపురం విమానాశ్రయం ఇంకా నిర్మాణ దశలో ఉండటం వల్ల ప్లాంట్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను డిజైన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగే వింగ్స్ ఇండియా’ ఏవియేషన్ షోలో దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే, ఏపీ మ్యాప్‌లో భోగాపురం ఒక గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా వెలిగిపోవడం ఖాయం.
