సాక్షిపై లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా..!

చినబాబు చిరుతిండి రూ. పాతిక లక్షలంటూ.. సాక్షి పత్రిక కొనాళ్ల కిందట రాసిన కథనంపై.. నారా లోకేష్.. రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన ఈ కథనానికి సంబంధించి.. లీగల్ నోటీసులను సాక్షి పత్రికకు పంపారు. అయితే సాక్షి పత్రిక.. తమ కథనానికి వివరణ ప్రచురించడానికి నిరాకరించడంతో.. లోకేష్ తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్లలో.. లోకేష్.. రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని.. అదంతా ప్రజాధనమని సాక్షి రాసింది. అయితే.. సాక్షి పత్రిక ప్రచురించిన తేదీల్లో లోకేష్ విశాఖలో లేరు. అదే సమయంలో.. ఆ ఖర్చు అంతా.. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చుగా తేలింది.

ఈ విషయాలను బయట పెట్టిన లోకేష్.. క్షమాపణ చెప్పాలని కోరుతూ.. సాక్షి యాజమాన్యానికి లేఖ రాశారు. వారు పట్టించుకోలేదు. ఇప్పుడు.. రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు. విశాఖ‌ 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో లోకేష్ దావా దాఖలు చేశారు. ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో వాజ్యం దాఖ‌లైంది. ఉన్నత విద్యావంతుడిగా. ఎమ్మెల్సీగా, ఓ రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి.. తన పరువు ప్రతిష్టలకు ఉద్దేశపూర్వకంగా మంటగలిపేందుకు ప్రయత్నించారని లోకేష్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, ఎడిటర్ వర్ధెల్లి మురళి, విశాఖ రిపోర్టర్లు వెంకటరెడ్డి, గరికపాటి ఉమాకాంత్‌లపై దావా వేశారు. నిజానికి సాక్షి పత్రిక రాసిన కథనం ఆధారంగా.. కొన్ని ఇంగ్లిష్ పత్రికలు కూడా..ఈ వార్తను ప్రచురించాయి.

వాటికి కూడా.. లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు. విషయం తెలుసుని ఆయా పత్రికలు.. తమ తమ పత్రికల్లోనే.. వివరణ ఇచ్చాయి. అది తప్పుడు సమాచారం అని క్షమాపణ కోరాయి. కానీ అసలు అసత్యాలతో వార్త రాసిన.. సాక్షి మాత్రం.. అలా వివరణ ఇవ్వడానికి నిరాకరించింది. నిజానికి.. సాక్షిలో.. చంద్రబాబు, లోకేష్‌లే కాదు.. టీడీపీ నేతలన్న ప్రతి ఒక్కరిపై.. కొన్ని వందల కథనాలు వచ్చాయి. వాటన్నింటిపై పరువు నష్టం కేసులు వేయాలంటే.. కోర్టుల సమయం కూడా సరిపోదని టీడీపీ నేతలు అంటూంటారు. అయితే.. ఈ కేసు ను మాత్రం సీరియస్‌గా తీసుకోవాలని లోకేష్ డిసైడయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com