భారీ అంచనాలతో వచ్చిన కూలీ ఆ అంచనాలు అందుకోలేకపోయింది. కలెక్షన్స్ పక్కన పెడితే.. క్రియేటివ్‌గా సినిమాకి బిలో యావరేజ్ మార్కులే పడతాయి. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై ప్రేక్షకులకి ఓ గట్టి నమ్మకం. ఆ నమ్మకంపై ఈ సినిమాతో గీతపడింది.
చాలా భారీ సెటప్‌తో ఈ సినిమా నడిపాడు లోకేష్. ప్రతి పరిశ్రమ నుంచి ఒక స్టార్‌ని పట్టుకొచ్చాడు. అందరికంటే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ని తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అమీర్ సరదాకి సినిమాలు చేసే నటుడు కాదు. ఆయనకో ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ అమీర్‌కి లోకేష్ ఏం చెప్పి ఇలాంటి పాత్రకి ఒప్పించాడా? అని ప్రశ్నించుకుంటే.. ఖచ్చితంగా విక్రమ్‌లో సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ నే రిఫరెన్స్‌గా చూపించుంటారు. చివర్లో అలా అదరగొట్టే క్యారెక్టర్ అవుతుందనే దాహా క్యారెక్టర్‌కి సైన్ చేసుంటారు అమీర్.
మరి ఎక్కడ లోపం జరిగింది?.. లోకేష్ కనకరాజ్ విజన్లోనే లోపం కనిపిస్తుంది. రోలెక్స్ పాత్రని కథతో ముడిపెట్టిన విధానం గొప్పగా ఉంటుంది. రోలెక్స్ డెన్లోకి వెళ్లి అతని వార్నింగ్ వింటాడు విక్రమ్. ఆ ఎపిసోడ్ అంతా హెవీ మాస్ అండ్ క్లాస్ మూమెంట్. రోలెక్స్ ఎంటరైన రెండు నిమిషాల్లోనే కథలో భాగమైపోయి ఎమోషన్ని ఇంజెక్ట్ చేయగలిగాడు. అన్నిటికంటే ముఖ్యంగా సూర్య క్యారెక్టర్ని పబ్లిసిటీ కోసం వాడుకోలేదు. చాలామందికి సినిమాలో సూర్య ఉన్నాడనే సంగతి రిలీజ్ అయ్యేంతవరకూ తెలియదు. అదొక సర్ప్రైజ్లా వర్క్ అయ్యింది.
కానీ దాహాగా అమీర్ క్యారెక్టర్ని ఫుల్ పబ్లిసిటీకి వాడేశారు. పైగా కథలో బలవంతంగా ఇరికించారు. లోకేష్ అమీర్ కోసం ఇంత వీక్ ప్లాట్ రాసుకుంటారని ఎవరూ ఊహించలేదు. అక్కడ దాహాలేకపోయినా వచ్చేనష్టం ఏమీ లేదు. అమీర్‌ని కేవలం పబ్లిసిటీ గిమ్మిక్ గా వాడుకోవాలనే ఉద్దేశం అడుగడుగునా కనిపించింది. ఫైనల్‌గా అమీర్ సౌత్‌లో చేసిన తొలి సినిమా ఆయనకి నిరాశనే మిల్చింది.