ఉద్యోగాల కల్పనలో తనదైన మార్క్ వేయాలని అనుకుంటున్నారు మంత్రి నారా లోకేష్. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగాల భర్తీపై దూకుడు పెంచేశారు. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన లోకేష్ , తాజాగా గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు కూడా పెంచుతూ తీపి కబురు ప్రకటించారు.
ఇదిలా ఉండగానే లోకేష్ నేతృత్వంలో ఉద్యోగాల కల్పనలో మరో కీలక ముందడుగు పడనుంది. పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చే దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు , పూర్తి స్థాయి సహకారం అందించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రూ.91,839 కోట్ల పెట్టుబడితో, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించిన లోకేశ్, రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని స్పష్టం చేశారు.దీనివల్ల అనుమతుల ప్రక్రియ వేగవంతమై, సంస్థలు త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలవుతుందని చెప్పారు.
రాన్నున ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ పునరుద్ఘాటించారు. విశాఖ నగరాన్నిఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.
యువగలం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల కల్పనలో లోకేష్ తనదైన మార్క్ వేస్తున్నారు.