తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరిమితమైన ఆప్ ఒకటి పెట్టుకుని పార్టీ ప్రతినిధులతో చాలా నిశితంగానూ సమగ్రంగానూ ఇంటరాక్ట్ అవతున్నారట. ఈ క్రమంలో వచ్చిన ప్రశ్నలూ సందేహాలు విమర్శలపై కూడా బాగానే స్పందిస్తున్నారట. గతంలో ఆయన స్పీడు తగ్గిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు చెప్పిన వారే ఇప్పుడు ఈ సంగతీ చెబుతున్నారు. అంతేగాక ఆ సందర్భంలో పార్టీ ప్రతినిధులు ఏవైనా సమాచారం కావాలనో లేక అధికారిక లెక్కలు కావాలనో అడిగితే ఫాలోఅప్ కూడా బాగానే చేస్తున్నారట. మొత్తంపైన సోషల్ మీడియాలో కొంత వెనుకబాటు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వుందని టిడిపి నాయకత్వం అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. వైసీపీ రకరకాల పేర్లతో సైట్టు నడుపుతున్నట్టు టిడిపి వారు భావిస్తున్నారు. వాటిలో చలామణి అవుతున్న రకరకాల కథనాలు లోకేశ్ బృందం దృష్టికి తెస్తుంటే ఎలా సమాధానమివ్వాలనే సమాలోచన జరుగుతుంటుంది. ఇటీవల చంద్రబాబు ఆరోగ్యంపై ఎవరో కొన్ని అపోహలు వ్యాప్తి చేస్తున్నట్టు కూడా దృష్టికి రావడంతో లోకేశ్ గట్టిగా ఖండించారు. పార్టీల విభేదాలు వివాదాలు ఎలా వున్నా ముందు ప్రజలకు తమ అభిమానులకు సమాచారం చేరేలా చూడాలని అందుకు వేగంగా ఇన్పుట్స్ ఇవ్వాలని టిడిపి యువ నేతలు కృషి చేస్తున్నారన్నది మాత్రం నిజం. ఈ క్రమంలో గతంలో వలె లోకేశ్ ట్విట్టర్ కామెంట్స్ వేగం పెరిగినా ఆశ్చర్యం లేదు. ఆయన మంత్రి అవడం ఖాయమని భావిస్తున్నారు గనక ఇదంతా ముందస్తు కసరత్తుగానూ ఉపయోగపడుతుంది.